తెలంగాణ

telangana

ETV Bharat / state

నగర శివార్లలో చోరీల కలకలం.. చెడ్డీ గ్యాంగ్​ పనేనా? - చెడ్డీ గ్యాంగ్​ దొంగతనాలు

నగర శివార్లలో వారం క్రితం చోరీకి పాల్పడిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న చెడ్డీ గ్యాంగ్ మరోసారి నగర శివార్లను చోరీకి ఎంచుకుందా..? అన్న కోణంలో ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ప్రత్యేక బృందాలను నేరుగా పర్యవేక్షిస్తూ నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

నగర శివార్లలో చోరీల కలకలం.. చెడ్డీ గ్యాంగ్​ పనేనా?

By

Published : Oct 31, 2019, 12:45 AM IST

అర్ధరాత్రి వేళ చేతిలో రాడ్లు, ఒంటిపై నిక్కర్లు.. ముఖాలకు ముసుగులు ధరించిన ఓ ముఠా... నగర శివార్లలో సంచరించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. వాటిని చూసిన బాధితులే కాదు.. స్థానికులందరూ భయాందోళనకు గురవుతున్నారు. సమసిపోయిందనుకున్న చెడ్డీ గ్యాంగ్ సమస్య మళ్లీ మొదలయిందేమోనని కలవరపడుతున్నారు.

హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూర్​లో ఈ నెల 25న రెండిళ్లల్లో దొంగల ముఠా చోరీకి పాల్పడింది. అర్ధరాత్రి సమయంలో వేద పాఠశాలలోకి ప్రవేశించి పాఠశాల నిర్వాహకులను కత్తులతో బెదిరించారు. భయంతో లక్ష రూపాయల నగదు, 11 తులాల బంగారాన్ని ఇంటి యజమాని కిషోర్ కుమార్ దొంగలకు ఇచ్చేశాడు. అమ్మవారి విగ్రహానికి ఉన్న మంగళసూత్రం, వెండి వస్తువులను కూడా దొంగలు దోచుకెళ్లారు. అంతటితో ఆగకుండా ఊరి చివర్లో తాళం వేసి ఉన్న మరో ఇంట్లో చొరబడి 50వేల నగదు, 5 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఆరుగురు సభ్యుల ముఠా ఈ చోరీలు చేసినట్లు హయత్ నగర్ పోలీసులు నిర్ధరణకు వచ్చారు. ఒకవేళ పోలీసుల దృష్టి మరల్చడానికి దొంగలు చెడ్డీలు వేసుకొని... చెడ్డీ గ్యాంగ్ పై అనుమానం వచ్చేలా చేశారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

చెడ్డిగ్యాంగ్​ పనేనా...

శివారు ప్రాంతాల్లో చోరీలు చేయడంలో చెడ్డీ గ్యాంగ్ దొంగలు సిద్ధహస్తులు. ఆరేడు మంది కలిసి వచ్చి ఎంచుకున్న ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్లను భయభ్రాంతులకు గురిచేసి ఆభరణాలు, నగదు దోచుకెళ్తారు. మాట వినకపోతే భౌతిక దాడులకు వెనకాడరు. చోరీ చేస్తున్నప్పుడు చెడ్డీలు వేసుకొని.... చెప్పులు భుజాన వేసుకొని, ఒంటిపై నూనె పూసుకుని, చేతిలో రాళ్లు, ఇతర మరణాయుధాలు పట్టుకోవడం చెడ్డీ గ్యాంగ్ ప్రత్యేకత. చోరీ చేసి పారిపోయే సమయంలో ఎవరైనా వెంబడించడానికి ప్రయత్నిస్తే రాళ్లు రువ్వడం, మరణాయుధాలతో దాడులు చేయడానికి చెడ్డీ గ్యాంగ్ దొంగలు వెనకాడరు.

ఎక్కడి నుంచి వచ్చారు

గుజరాత్​లోని దాహోడ్ జిల్లాలోని ఆదివాసి తెగకు చెందిన కొంత మంది ఈ తరహా చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వర్షాకాలం సీజన్​లో వ్యవసాయ పనులు చేసుకొని మిగతా సమయాల్లో చోరీలకు పాల్పడుతుంటారు.

చెడ్డీ గ్యాంగ్ లో నాయకులతో పాటు.... దొంగలను అరెస్ట్ చేయడం వల్ల కొన్నినెలలుగా వాళ్ల అలికిడి లేకుండా పోయింది. మరోసారి చెడ్డీ గ్యాంగ్ తరహాలోనే చోరీలు జరగడం పోలీసులు ప్రధానంగా దృష్టి సారించి దొంగలను పట్టుకునే పనిలో ఉన్నారు.

నగర శివార్లలో చోరీల కలకలం.. చెడ్డీ గ్యాంగ్​ పనేనా?

ఇదీ చూడండి: ఆ రెండు దొంగతనాలు చేసింది చెడ్డీ గ్యాంగేనా?

ABOUT THE AUTHOR

...view details