రాచకొండ కమిషనరేట్ పరిధిలో నిందితులకు పోలీసులు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. దేశంలోనే అతి పెద్ద కమిషనరేట్ పరిధిలో పోలీసులు కన్విక్షన్ రేట్‌లో సత్తా చాటుతున్నారు. సాంకేతికత ఉపయోగించి సాక్ష్యాలు సేకరణ, విచారణ వేగవంతం చేసి సాధ్యమైనంత త్వరగా నిందితులకు శిక్షలు ఖరారయ్యేలా చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే పలు కీలక కేసుల్లో 62 మంది నిందితులకు శిక్షలు పడ్డాయి. ఇందుకు కృషి చేసిన పోలీసు సిబ్బందిని, కోర్టు సిబ్బందిని సీపీ మహేష్ భగవత్ అభినందించారు.
చిక్కితే శిక్ష పక్కా..
ముఖ్యంగా గతేడాది ఆగస్టులో మహేశ్వరం ఠాణా పరిధిలో ఇటుక బట్టీలో పని చేస్తున్న ఒడిశాాకు చెందిన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ నలుగురు నిందితులకు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2018 కీసరలో ఆభరణాల దుకాణంలో తుపాకులతో బెదిరించి చోరీ చేసిన కేసులో నిందితులు నలుగురికి ఎనిమిదేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. ఇలా పలు కీలక కేసుల్లో సాక్షాధారాలను సేకరించి నిందితులకు శిక్షలు పడేలా రాచకొండ పోలీసులు వ్యవహరించారు.