రద్దీ రహదారులపై దూసుకెళ్లే వాహనదారులు. విశాలమైన రోడ్లపై వంద కిలోమీటర్లకంటే వేగంగా వెళ్తున్న కార్లు.. బైకులు.. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాలు చేస్తున్న మందుబాబులు.. కొత్త రోడ్ల నిర్మాణం.. మరమ్మతుల కారణంగా ఏర్పడిన గుంతలు.. రాత్రివేళల్లో కనిపించని సూచికలు.. రాజధాని నగరంలో నమోదవుతున్న ప్రమాదాలకు ప్రధాన కారణాలు. సాధారణ ప్రమాదాలతో పాటూ కొత్త ప్రాంతాల్లోనూ తీవ్ర ప్రమాదాలు జరుగుతుండడంతో హైదరాబాద్ పోలీసులు వీటిని తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నారు. లాక్‌డౌన్ తొలగించినప్పటి నుంచి ప్రమాదాల సంఖ్య పెరుగుతుండడంతో వాటిని అధ్యయనం చేసి కొత్తగా 50 బ్లాక్‌స్పాట్ల(ప్రమాద ప్రాంతాలు) గుర్తించారు. సాధ్యమైనంత వేగంగా అక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు.
ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
రహదారులపై గుంతలు, మరమ్మతులు, విభాగినులు, బ్యారికేడ్లు.. ఇలా వివిధ కారణాలతో ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్‌స్పాట్లను ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో కొత్తగా 50 ప్రమాద ప్రాంతాలను గుర్తించారు. అక్కడ రోడ్డు ప్రమాదాలు జరగకుండా సూచికలు ఏర్పాటు చేశారు. వాహనాల వేగాన్ని తగ్గించేందుకు రంబుల్‌స్ట్రిప్స్‌ను రోడ్లపై అమర్చారు. తరచూ ప్రమాదాలు నమోదవుతున్న జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, సికింద్రాబాద్, మెట్టుగూడ, అబిడ్స్, కోఠి, అంబర్‌పేట, మలక్‌పేట ప్రాంతాల్లో ట్రాఫిక్ కూడళ్ల వద్దే కాకుండా ఇతర ప్రాంతాల్లో సిమెంట్ పిల్లర్లు, బొల్లార్డ్‌లు ఏర్పాటు చేశారు. జూన్, జులై నెలల్లో జరిగిన ప్రమాద ప్రాంతాలకు వెళ్లి ఆ ప్రాంతాల పరిసరాల్లో వాహనదారులకు పగలూ, రాత్రి కనిపించేలా సూచికలు ఏర్పాటు చేశారు.