Hyderabad Literary Festival: హైదరాబాద్ విద్యారణ్య పాఠశాలలో శుక్రవారం ప్రారంభమైన సాహితీ ఉత్సవం.. మూడు రోజుల ముచ్చటైన పండుగగా సాగింది. సాహిత్యం, కళలు, సంస్కృతి పరిరక్షణే లక్ష్యంగా ఈ వేడుక సాగింది. 2010లో ప్రారంభమైన ఫెస్ట్.. కొవిడ్ నేపథ్యంలో గత రెండేళ్లుగా కేవలం ఆన్‌లైన్‌కే పరిమితం కావటం ఔత్సాహికులను ఎంతగానో నిరాశపరిచింది. ఈ ఏడాది సరికొత్త జోరుతో మరింత భిన్నంగా సాంకేతికతను అందిపుచ్చుకుని ఆద్యంతం ఆకట్టుకుంది.
అన్ని తరాల వారిని ఆకర్షించిన లిటరరీ ఫెస్ట్: చిన్నా పెద్దా అని తేడా లేకుండా అన్ని తరాల వారిని ఆకర్షించింది. ఔత్సాహిక రచయితలను ప్రోత్సహించటంతో పాటు.. జాతీయ అంతర్జాతీయ రచయితలను కలిసే అవకాశాన్ని కల్పించింది. పాఠకులకు, రచయితలకు మధ్య వారధిగా కొనసాగిన హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్‌లో కదిలే బొమ్మల కథలు, మట్టితో, రంగులతో విభిన్న రకాల కళాకృతుల వర్క్‌షాప్‌లు, మ్యూజిక్ బ్యాండ్‌లు, నుక్కాడ్‌షోలు చిన్నారులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సేవ్ రాక్ పేరుతో రాళ్లను కాపాడుకోవటం పై నిర్వహించిన కార్యక్రమం ఔత్సాహికులను విశేషంగా అలరించింది.
హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ మాత్రం ఇందుకు భిన్నం: సాధారణంగా లిటరరీ ఫెస్ట్ పేరు చెబితే గుర్తొచ్చేవి పుస్తకాలు మాత్రమే . కానీ హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ మాత్రం ఇందుకు భిన్నం. విభిన్న రకాల పుస్తకాలు దొరికే ఈ ఫెస్ట్‌లో చిన్నారుల కోసం ప్రత్యేకంగా వర్క్ షాప్‌లు నిర్వహించటం విశేషం. టైం మేనేజ్‌మెంట్, మట్టితో బొమ్మల తయారీ, ప్రకృతిని కాపాడుకోకపోతే కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన పెయింటింగ్స్ బుజ్జాయిలను విశేషంగా ఆకర్షించాయి.
సాంస్కృతిక సంబరమే కాదు.. సామాజిక బాధ్యత: స్టోరీ టెల్లర్ మిషన్ పేరుతో చిన్నారులు అప్పటికప్పుడు చిన్న చిన్న కథలను ప్రింట్ తీసుకుని చదివేలా ఏర్పాటు చేసిన యంత్రాలు.. కుకింగ్ వర్క్ షాప్‌లను పిల్లలు ఆసక్తిగా తిలకించారు. సాంస్కృతిక సంబరమే కాదు.. సామాజిక బాధ్యతకు లిటరరీ ఫెస్ట్ వేదికగా నిలిచింది. దివ్యాంగ కళాకారులను ప్రోత్సహిస్తూ.. వారు వేసిన పెయింటింగ్‌లను విక్రయించి వారికి అండగా నిలిచింది.