తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రాద్రి రామయ్య కల్యాణ తలంబ్రాలు.. TSRTC డోర్ డెలివరీకి అనూహ్య స్పందన - Booking of Talambralu in TSRTC

Huge Response Bhadradri Ramaiah Kalyana Talambralu: భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు భక్తుల నుంచి ఊహించని విధంగా స్పందన వస్తోందని టీఎస్​ఆర్టీసీ వెల్లడించింది. ఇప్పటివరకు లక్ష మందికి పైగా భక్తులు తలంబ్రాల కోసం నమోదు చేసుకున్నారని తెలిపింది. వీరందరికి రెండు, మూడు రోజుల్లోనే వీటిని అందజేయనున్నట్లు సంస్థ పేర్కొంది.

TSRTC
TSRTC

By

Published : Apr 3, 2023, 3:41 PM IST

Huge Response Bhadradri Ramaiah Kalyana Talambralu: భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు భక్తుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటివరకు ఒక లక్ష మందికి పైగా భక్తులు వీటికి కోసం బుకింగ్‌ చేసుకున్నారు. మొదటి విడతలో 50,000 మంది భక్తులకు టీఎస్‌ఆర్టీసీ హోండెలివరీ చేస్తోంది. ఈనెల 2 నుంచే ఈ డెలివరీ ప్రక్రియను ప్రారంభించారు. భక్తుల డిమాండ్‌ దృష్ట్యా తలంబ్రాల బుకింగ్‌ను ఏప్రిల్ 10 వరకు పొడిగించినట్లు సంస్థ వెల్లడించింది.

బుక్‌ చేసుకున్న భక్తులకు రెండు, మూడు రోజుల్లోనే తలంబ్రాలను అందజేస్తామని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలను టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తొలి బుకింగ్‌ చేసుకున్నారు. హైదరాబాద్‌ బస్​భవన్‌లో ఇవాళ ఆయనకు సంస్థ లాజిస్టిక్స్ బిజినెస్‌ హెడ్‌ పి.సంతోష్‌ కుమార్‌ ముత్యాల తలంబ్రాలను అందజేశారు. భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు భక్తుల నుంచి ఊహించని విధంగా స్పందన వస్తోందని సజ్జనార్ తెలిపారు.

తలంబ్రాలను బుక్‌ చేసుకున్న.. లక్ష మందికి పైగా భక్తులు: ఎంతో విశిష్టమైన తలంబ్రాలను తీసుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నారని సజ్జనార్ పేర్కొన్నారు. గత ఏడాది 88,000 మంది బుక్‌ చేసుకుంటే.. ఈసారి 3వ తేదీ నాటికి రికార్డు స్థాయిలో ఒక లక్ష మందికి పైగా భక్తులు తలంబ్రాలను బుక్‌ చేసుకున్నారని చెప్పారు. మొదటగా 50,000 మందికి తలంబ్రాలను టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌ విభాగం హోం డెలివరీ చేస్తోందని వివరించారు. దేవాదాయ శాఖ సహకారంతో వాటిని భక్తులకు అందజేస్తున్నామని సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.

ఏప్రిల్ 10 వరకు బుకింగ్ పొడిగింపు:భక్తుల నుంచి వస్తోన్న విజ్ఞప్తి నేపథ్యంలో తలంబ్రాల బుకింగ్‌ను.. ఈ నెల 10 వరకు పొడిగించాలని యాజమాన్యం నిర్ణయించిందని సజ్జనార్‌ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని టీఎస్‌ఆర్టీసీ కార్గో పార్శిల్‌ కౌంటర్లలో వీటిని బుక్‌ చేసుకోవచ్చన్నారు. ఈ సేవలను పొందాలనుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌ విభాగ ఫోన్‌ నంబర్లు 9177683134, 7382924900, 9154680020లలో సంప్రదించాలని పేర్కొన్నారు. తమ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లు భక్తుల వద్ద కూడా ఆర్డర్‌ను స్వీకరిస్తారని వివరించారు. భక్తులందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకుని, ఎంతో విశిష్టమైన తలంబ్రాలను పొందాలని సజ్జనార్ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details