How Much Rainfall Recorded in Greater Hyderabad : గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad) పరిధిలో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తూనే ఉంది. దీంతో నగరంలోని పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. అప్పటివరకు భారీగా కురిసిన వర్షం(Heavy Rain in Hyderabad).. మధ్యాహ్నమయ్యే సరికి కాస్త ఎడతెరపి ఇచ్చింది. నగరంలోని రాంనగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, హిమాయత్ నగర్, రైల్ నిలయం, అంబేద్కర్ నగర్, బోయిన్ పల్లి ప్రాంతాల్లోని కాలనీల్లోకి వర్షపు నీరు భారీగా వచ్చి చేరింది. కొన్ని కాలనీల్లోకి వర్షం నీరు ఇళ్లలోకి వచ్చిందని, నిత్యాసర సరుకులు తడిసిపోయాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
కాలనీ రోడ్లు అన్నీ చెరువులను తలపించేలా నీళ్ల ప్రవాహం కొనసాగింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌లో రికార్డు స్థాయి(Record Rainfall)లో వర్షపాతం నమోదు అయింది. మియాపూర్‌లో అత్యధికంగా 14 సెంటీమీటర్లు.. అత్యల్పంగా బహదూర్‌పురాలో 8.2 సెంటీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేశారు.
Heavy Rains in Hyderabad Today : హైదరాబాద్‌లో కురుస్తున్న జోరు వానలు.. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ
ఏఏ ప్రాంతాల్లో ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదు :
ప్రాంతం | వర్షపాతం(సెంటీమీటర్లు) |
మియాపూర్ | 14 సెంటీమీటర్లు |
బండ మైలారం | 13.8 సెం.మీ |
దుండిగల్ ఫారెస్ట్ అకాడమీ | 12.9 సెం.మీ |
కూకట్‌పల్లి, హైదర్‌నగర్ | 12.7 సెం.మీ |
మాదాపూర్ | 10.7 సెం.మీ |
శేరిలింగంపల్లి | 11.45 సెం.మీ |
షేక్‌పేట | 11.9 సెం.మీ |
బోరబండ | 11.6 సెం.మీ |
గాజుల రామారం | 10.9 సెం.మీ |
షాపూర్ | 10.6 సెం.మీ |
బాచుపల్లి, రాయదుర్గం | 10.1 సెం.మీ |
ఖైరతాబాద్ | 10.1 సెం.మీ |
రాజేంద్రనగర్ | 10 సెం.మీ |
గచ్చిబౌలి | 9.6 సెం.మీ |
బహదూర్‌పురా | 8.2 సెంటీమీటర్లు |
వర్షాలపై సీఎస్ శాంతి కుమారి సమీక్ష : రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయన్న వాతావరణశాఖ సూచన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా అన్ని శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్.. జిల్లాల్లోని పరిస్థితులను సమీక్షించారు. డీజీపీ అంజనీకుమార్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.