ప్రభుత్వ ఆదేశాలతో ఇంటింటి తిరిగి ఫీవర్ సర్వే చేపట్టారు జీహెచ్‌ఎంసీ అధికారులు. కొవిడ్ నియంత్రణలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్‌లో సర్వే నిర్వహించారు. వైద్యారోగ్య శాఖకు చెందిన 704 బృందాలు ఆదివారం 41,192 ఇళ్లలో సర్వే పూర్తి చేశారు. జ్వరంతో బాధపడుతున్న వారి వివరాలను సేకరించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు చేపడుతున్నారు. ఒక్కో బృందంలో ఏఎన్‌ఎమ్, ఆశావర్కర్, జీహెచ్ఎంసీ వర్కర్ సభ్యులుగా ఉన్నారు.
కొవిడ్ కట్టడికి జీహెచ్‌ఎంసీలో ఫీవర్ సర్వే
కొవిడ్ నియంత్రణలో భాగంగా జీహెచ్‌ఎంసీలో ఇంటింటికీ వెళ్లి ఫీవర్ సర్వే చేపట్టారు అధికారులు. దాదాపు 704 బృందాలుగా గ్రేటర్‌లో వివరాలు సేకరిస్తున్నారు. జ్వరంతో బాధపడుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటున్నారు.
జ్వరం కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది క్రిమిసంహారక ద్రావణం పిచికారి చేస్తున్నారు. నగరంలోని ప్రతీ బస్తీ దవాఖానా, అర్బన్ హెల్త్ సెంటర్లలో పరీక్షలు నిర్వహించారు. తమ పరిధిలో చేపట్టిన ఇంటింటి ఫీవర్ సర్వే, ఆసుపత్రుల్లో జరిపిన ప్రాథమిక వైద్య పరీక్షలను సంబంధిత జోనల్, డిప్యూటీ కమీషనర్లు, మెడికల్ ఆఫీసర్లు ప్రత్యేకంగా పర్యవేక్షించారు. జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన కొవిడ్ కంట్రోల్ రూమ్‌కు వచ్చిన ఫోన్‌కాల్స్‌కు ప్రత్యేకంగా నియమించిన వైద్యాధికారులు తగు సలహాలు, సూచనలు అందించారు.