రాజధాని పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరే కరోనా రోగుల తాజా ఆరోగ్య పరిస్థితి గురించి వారి కుటుంబీకులకు సకాలంలో తెలియడం లేదు. ఐసీయూలో వెంటిలేటర్, ఆక్సిజన్ పడకల్లో ఉన్న రోగుల సమాచారం ప్రతి రోజూ అందించకుండా కొన్ని ఆస్పత్రులు దాచిపెడుతున్నాయన్న భావనలో కుటుంబీకులు ఉన్నారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని అనేకమంది ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
మహబూబ్‌నగర్‌కు చెందిన వ్యక్తి కరోనా బారిన పడటంతో అత్తాపూర్‌లోని ఒక ఆస్పత్రిలో నాలుగు రోజుల కిందట చేరారు. ఆరోగ్యం విషమంగా మారినా ఆస్పత్రివర్గాలు కుటుంబీకులకు చెప్పలేదు. కోలుకుంటున్నారన్న సమాచారం ఇచ్చారు. పరిస్థితి మరింత విషమంగా మారడంతో అప్పుడు కుటుంబీకులను పిల్చి తమ దగ్గర వెంటిలేటర్ పడకలు ఖాళీగా లేవు. ఈ సౌకర్యం ఉన్న ఆస్పత్రికి తీసుకువెళ్లండని చెప్పడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరై అప్పటికప్పుడు వేరే ఆస్పత్రిలో చేర్చారు.
కొండంత ఆశతో వస్తే..
నగరంలో దాదాపు 15 వేలమంది కరోనా రోగులు ఆయా ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రోగుల కుటుంబీకులు మాత్రం ఆస్పత్రుల ఆవరణలోనే చెట్లకింద, పరిసరాల్లో రోజుల తరబడి నిరీక్షిస్తూ తమవారు కోలుకుని ఇళ్లకు చేరుతారన్న కొండంత ఆశతో ఉన్నారు. కొవిడ్ వార్డులోకి కుటుంబీకులను అనుమతించడం లేదు. ప్రధానంగా వెంటిలేటర్ , ఆక్సిజన్ పడకల్లో ఉన్న రోగుల పరిస్థితి ఎలా ఉందన్న కచ్చితమైన సమాచారం వారి కుటుంబీకులకు ఏరోజుకారోజు చేరడం లేదు. సాధారణంగా ఆస్పత్రుల్లో చేరిన రోగుల్లో అధికభాగం ఆక్సిజన్ స్థాయి తగ్గినవారే ఉంటున్నారు. వీరిని వెంటిలేటర్ మీద పెట్టి ఆక్సిజన్ ఇస్తే 80 నుంచి 90 శాతం వరకు ఆక్సిజన్ స్థాయి ఉంటోంది. ఆక్సిజన్ లేనప్పుడు మళ్లీ 50 శాతం పైనే ఉంటోంది. ఇంతటి విషమ పరిస్థితి గురించి రోగుల కుటుంబీకులకు చెప్పడం లేదు. ఖమ్మంకు చెందిన రోగి పది రోజుల కిందట మియాపూర్ ఆస్పత్రిలో చేరారు. అప్పటికి అతని ఆక్సిజన్ శాతం 75 వరకు ఉంది. కానీ వైద్యులు మాత్రం 50 శాతం కోలుకున్నాడని తెలిపారు. అదేరోజు సాయంత్రం చనిపోయాడని సమాచారం ఇచ్చారు. ఇదే పరిస్థితి అనేక ఆస్పత్రుల్లోనూ ఉంది. ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగుల క్షేమ సమాచారం అందడం లేదని కొందరు ఆరోపిస్తున్నారు.