హైదరాబాద్ హెచ్ఐసీసీలో 'సోసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్-ఎస్సీఎస్సీ' 15 వార్షికోత్సవం ఘనంగా జరిగింది. హోంశాఖ మంత్రి మహమూద్ అలీ డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్, రాచకొండ సీపీలు, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్ల సహా ఐటీ కంపెనీల ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. నేరాల కట్టడి, నియంత్రణలో తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని అతిథులు అభినందించారు.
సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్... పోలీసులకు, పరిశ్రమలకు వారధిగా నిలుస్తోందని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. 15ఏళ్ల ప్రస్థానంలో ఎస్సీఎస్సీ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. ఐటీ కారిడార్‌లో భద్రతే లక్ష్యంగా ఏర్పడిన సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్... క్రమంగా సేవా కార్యక్రమలకు విస్తరించిందని మహేందర్ రెడ్డి తెలిపారు. సైబర్ భద్రతే లక్ష్యంగా త్వరలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయబోతున్నామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు.
షీషటిల్స్, కమాండబుల్స్, మార్గదర్శక్, సంఘమిత్ర, ట్రాఫిక్ వలంటీర్స్ వంటి విభాగాలను సైబరాబాద్ సెక్యూరిటీ కౌనిల్స్ ప్రవేశపెట్టింది. పౌరుల జీవితాన్ని మెరుగుపర్చడంలో ఈ విభాగాలు కీలక ప్రభావం చూపాయి.
-మహమూద్ అలీ, హోంమంత్రి
తెలంగాణ పోలీసు వ్యవస్థలో సాంకేతికను ప్రవేశపెట్టేముందు.... మా బృందం లండన్ మెట్రోపాలిటన్, న్యూయార్క్ సిటీ, వాషింగ్టన్ డీసీ పోలీసు వ్యవస్థల్ని పరిశీలించింది. అక్కడ ఎలాంటి సాంకేతిక వాడుతున్నారో పరిశీలించాం. రాష్ట్రానికి తిరిగివచ్చి ఎలా అమలు చేయాలనే విషయంపై దృష్టిసారించాం. ప్రపంచ పోలీసు వ్యవస్థలోనే సాంకేతిక వినియోగంలో.. కొన్ని కేసులో సమానంగా, మరికొన్ని కేసుల్లో మెరుగ్గా తెలంగాణ పోలీసులు ఉన్నారనే విషయాన్ని నేను గర్వంగా చెబుతున్నాను.
-మహేందర్‌రెడ్డి, డీజీపీ
రహదారి, మహిళ భద్రతకు తీసుకోవాల్సిన చర్యల్లో స్థిరత్వం సాధించాం. సైబర్ భద్రతనే మా తదపరి సవాల్. ప్రస్తుతం ఆ దిశలో ఇప్పటికే అడుగులు వేస్తున్నాం. డీపీజీ మహేందర్‌రెడ్డి ఎప్పుడూ సైబర్ భద్రత అంశాలపై మాతో చర్చిస్తుంటారు. ఐటీ పరిశ్రమ సాయంతో.. సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్.. త్వరలోనే సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను మా కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేయబోతోంది. ఇప్పటికే ప్రణాళిక ప్రారంభమైంది. ఇదే భవిష్యత్తు లక్ష్యం.