HMDA Auction Shabad Lands In Rangareddy : హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని భూములు కోట్ల వర్షాన్ని కురిపిస్తున్నాయి. ఈ రెండు జిల్లాల్లో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో భూముల వేలం కొనసాగుతోంది. కోకాపేట, మోకిల్ల తర్వాత నేడు రంగారెడ్డి జిల్లా షాబాద్‌లోని ప్లాట్లను విక్రయించారు. ఈ షాబాద్ ప్రాంతంలో వంద ఎకరాల విస్తీర్ణంలోని లే అవుట్‌ను హెచ్ఎండీఏ ప్రతిపాదించింది.
ఇవాళ 50 ఓపెన్ ప్లాట్లను ఈ-వేలం(e-auction) ద్వారా విక్రయించింది. 300 చదరపు గజాల చొప్పున విస్తీర్ణం ఉన్న 15 వేల చదరపు గజాల విస్తీర్ణంతో రూ.15 కోట్ల రూపాయలుగా నిర్ధారించారు. అయితే చదరపు గజానికి అప్ సెట్ ధరను పదివేల రూపాయలుగా నిర్ధారించగా.. ఈ-వేలంలో చదరపు గజం గరిష్ఠంగా రూ.27 వేలు.. కనిష్ఠందా రూ.18 వేలు పలికింది. ఇక్కడ సగటున చదరపు గజం రూ.22,040లకు అమ్ముడైపోయింది. దీంతో 50 ప్లాట్ల విక్రయంతో రూ.33 కోట్ల 6 లక్షలు ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది.
ఆదరణ అదిరింది... హెచ్ఎండీఏకు భారీగా ఆదాయం
Kokapet Lands Auction 2023 : మరోవైపు గతవారం కోకాపేట(Kokapeta) నియోపొలిస్ ఫేజ్-2లోని భూముల ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ కోకాపేటలోని 45.33 ఎకరాల భూమికి వేలం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.3,319.60 కోట్లు భారీగా ఆదాయం సమకూరింది. ఇక్కడ వేలంలో ఎకరం అత్యధికంగా రూ.100.75 కోట్లు పలుకగా.. అత్యల్పంగా ఎకరా భూమి రూ.67.25 కోట్లకు అమ్ముడైపోయింది.
కోకాపేట ప్రాంతంలో సగటున ఎకరానికి రూ.73.23 కోట్లు ధర పలికింది. 45.33 ఎకరాలకు హెచ్ఎండీఏ(HMDA) ఈ-వేలం నిర్వహించింది. ఈ-వేలంలో కనీస నిర్దేశిత ధర ఎకరానికి రూ.35 కోట్లు కాగా.. పదో నంబర్ ప్లాట్‌కు గరిష్ఠంగా రూ.100 కోట్లుకు పైగా ధర పలికిందని అధికారులు వెల్లడించారు. అలాగే మరికొన్ని ప్లాట్లకు రూ.72 కోట్లకు పైగా కూడా ధర పలికిందన్నారు.