High Temperature in Telangana : రాష్ట్రంలో మండుటెండలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు మే 29 వరకు ఈ ఎండలు దంచి కొడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం సుమారు అన్ని ప్రాంతాల్లోను ఉదయం సమయంలో ఉష్ణోగ్రత 40 నుంచి 46 డిగ్రీల మధ్య నమోదయింది. అన్ని ప్రాంతాలకంటే అధికంగా భద్రాద్రి జిల్లా జూలూరుపాడులో ఏకంగా 46.4 ఉష్ణోగ్రత నమోదైంది. బయ్యారంలో 45.3 డిగ్రీలు, సూర్యాపేట జిల్లా మామిళ్ల గుడెంలో 45.2 డిగ్రీలు, నల్గొండ జిల్లాలోని నిడమనూరులో 45.2 డిగ్రీలు, జయశంకర్ జిల్లాలోని మహాదేవ్‌పూర్‌లో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
వేడి గాలులు వీస్తున్నాయి : రాష్ట్రంలో మంగళవారం పగటిపూట అత్యధికంగా ఉష్ణోగ్రత 45.2 డిగ్రీలుండగా.. తరువాత రోజు 1.2 డిగ్రీలు పెరగటం గమనార్హం. అధిక ఉష్ణోగ్రత కారణంగా రాష్ట్రంలో వేర్వేరు చోట ఏడుగురు మృతి చెందారు. గురువారం పలు ప్రాంతాల్లో 43 డిగ్రీల నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో వేడి గాలులు వీస్తున్న కారణంగా ప్రజలు బయట తిరగాలంటే జంకుతున్నారు.
సాధారణం కంటే ఎక్కవగా నమోదు: ఉదయం ఎండల ప్రభావం వల్ల రాత్రిపూట కూడా వేడిగా ఉండడంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం హనుమకొండలో 31 డిగ్రీలు, ఖమ్మంలో 30 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ప్రాంతాల్లో సాధారణంగా కంటే 3.6 డిగ్రీలు అధికంగా నమోదైంది. రాష్ట్రంలో అత్యల్పంగా మంగళవారం రాత్రి మహానగర శివారులోని పటాన్చెరులో 20.0 డిగ్రీలు నమోదైంది. ఇది సాధారణ ఉష్ణోగ్రత కంటే 4.8 డిగ్రీలు తక్కువ. పగలు ఆకాశంలో మేఘాలు లేకపోవడం , నిర్మలంగా ఉండటంచే సూర్యకిరణాలు నేరుగా భూమిపై పడటం వల్ల వాతావరణం బాగా వేడెక్కుతోంది. మేఘాలు లేని ప్రాంతాల్లో రాత్రిపూట కూడా అక్కడి వాతావరణం ఉక్కపోతగా ఉంటుంది.