తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యేల ఎర కేసు.. సీబీఐ దర్యాప్తుపై నేడు హైకోర్టు తీర్పు - హైకోర్టు తాజా వార్తలు

High Court On MLAs Poaching Case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐ దర్యాప్తుపై నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. దీనిపై సీజే ధర్మాసనంలో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తప్పుపడుతూ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశించిన విషయం తెలిసిందే.

High Court On MLAs Poaching Case
High Court On MLAs Poaching Case

By

Published : Feb 6, 2023, 7:26 AM IST

High Court On MLAs Poaching Case: ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించనుంది. ఈ కేసును సీబీఐకి అప్పగించొద్దంటూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. సీబీఐ విచారణ జరపాలని నిందితులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీజే ధర్మాసనంలో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తప్పుపడుతూ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు.

MLAs Poaching Case Update: ముఖ్యమంత్రి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన వీడియోలను, వివరాలను బయటపెట్టారన్న ఒకే ఒక కారణంతో కేసును సీబీఐకి అప్పగించడం తగదని దవే వాదించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్​పై నమ్మకం లేదని నిందితుల తరపు న్యాయవాదులు వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న సీజే ధర్మాసనం గత నెల 30న తీర్పుని రిజర్వ్ చేసింది. ఈ కేసుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పునే సమర్థిస్తుందా? లేకపోతే సిట్ దర్యాప్తు కొనసాగించాలని ఆదేశిస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది.

సీబీఐకి అప్పగించిన హైకోర్టు..: ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తు పట్ల నమ్మకం లేదని బీజేపీ, నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజి వేసిన పిటిషన్లు పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు కేసును సీబీఐకి అప్పగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని సిట్‌ తరఫున అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో పురోగతి ఉన్నందున సిట్‌తో దర్యాప్తు చేయించాలని ఆయన కోరారు. అయితే, అడ్వకేట్‌ జనరల్‌ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తు వివరాలను సీబీఐకి అందజేయాలని సిట్‌ను ఆదేశించింది.

అసలేంటీ కేసు..: గత సంవత్సరం అక్టోబర్‌ 26న హైదరాబాద్‌ శివారులోని మెయినాబాద్‌లో బీఆర్​ఎస్​కు చెందిన ఎమ్మెల్యేల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపీలో చేరాలంటూ తనతో పాటు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, రేగా కాంతారావులను కొందరు ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ అక్టోబర్‌ 26న తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొయినాబాద్‌ పోలీసులు బేరసారాలకు జరుగుతున్న ఫాంహౌజ్‌పై దాడులు నిర్వహించారు.

ఈ వ్యవహారంలో రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిలను అదే రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ నేతృత్యంలో ఏర్పాటైన సిట్‌.. న్యాయస్థానం అనుమతితో నిందితులను పలుమార్లు కస్టడీలోకి తీసుకుని విచారించింది.

ఈ క్రమంలోనే లభించిన ఆధారాలతో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్‌తో పాటు కేరళకు చెందిన తుషార్‌, జగ్గుస్వామిని విచారించేందుకు నోటీసులు జారీచేసింది. ఈ నేపథ్యంలో వారు హైకోర్టును ఆశ్రయించటంతో వీరికి ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చిన నోటీసులతో స్టే విధించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న నందకుమార్, రామచంద్రభారతి, సింహయాజిలు బెయిల్‌ కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా పలు దఫాలుగా విచారణ జరిపిన న్యాయస్థానం.. అనంతరం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు పట్ల నమ్మకం లేదంటూ ఈ కేసు నిందితులతో పాటు బీజేపీతో పాటు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విచారించిన ధర్మాసనం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details