ఏపీ విజయవాడలోని పటమట సబ్ రిజిస్ట్రార్‌గా పోస్టింగ్ ఇచ్చిన ఏ.రాఘవరావును ఆరు రోజుల్లోనే బదిలీ చేయడాన్ని తప్పుపట్టిన ఏపీ హైకోర్టు.. బదిలీ ఉత్తర్వుల అమలును నిలిపివేసింది. విజయవాడలోని స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న రాఘవరావును పదోన్నతిపై పటమట సబ్ రిజిస్ట్రార్‌గా నియమిస్తూ ఈ ఏడాది జూన్ 17న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన 20న బాధ్యతలు తీసుకున్నారు. జూన్ 22న డీఐజీ మరో ఉత్తర్వు ఇస్తూ ఆయన్ను పటమట నుంచి తణుకు సబ్‌రిజిస్ట్రార్‌గా బదిలీ చేశారు. ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ రాఘవరావు సింగిల్ జడ్జి వద్ద వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ బదిలీ వెనుక ఎలాంటి దురుద్దేశం కనిపించడం లేదంటూ తీర్పు ఇచ్చిన సింగిల్ జడ్జి.. వ్యాజ్యాన్ని కొట్టేశారు. ఈతీర్పుపై రాఘవరావు ధర్మాసనం ముందు అప్పీల్ వేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్‌ను విచారించింది.
రాఘవరావు తరఫున సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ ‘బాధ్యతలు తీసుకున్న రెండు రోజుల్లోనే పిటిషనర్‌ను మరో స్థానానికి బదిలీ చేశారు. దీని వెనుక రాజకీయ కారణాలున్నాయి. జిల్లా రిజిస్ట్రార్ స్థాయి అధికారిని పటమట సబ్ రిజిస్ట్రార్‌గా నియమించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం సింగిల్ జడ్జి వద్ద తెలిపింది. కానీ ఇప్పటికీ అక్కడ సీనియర్ అసిస్టెంటే.. ఇన్‌ఛార్జి సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారు’ అని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ న్యాయవాది అశ్వర్థనారాయణ వాదిస్తూ, ‘బదిలీ వెనుక దురుద్దేశం లేదు. పిటిషనర్‌పై అనిశా కేసు ఉంది. శాఖాపరమైన విచారణ జరుగుతోంది’ అని చెప్పారు. జీపీ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది.
దత్తత సులభతరం చేయాలి:పిల్లలను చట్టబద్ధంగా దత్తత తీసుకునే వ్యవహారం సులభతరం చేయాల్సిన అవసరం ఉందని సీనియర్ న్యాయవాది పి.శ్రీరఘురాం (అమికస్ క్యూరీ) హైకోర్టుకు నివేదించారు. చిన్నారులను విక్రయించి సొమ్ము చేసుకుంటున్న వైనంపై ఇటీవల పత్రికల్లో వచ్చిన రెండు కథనాలను పరిగణనలోకి తీసుకొని సుమోటో ప్రజాహిత వ్యాజ్యాలుగా మలిచి హైకోర్టు విచారణ జరుపుతోంది. ఈ పిల్‌పై మంగళవారం విచారణలో శ్రీరఘురాం ప్రాథమిక వివరాలను కోర్టు ముందుంచారు. అందులో.. ‘దత్తత ప్రక్రియ జటిలంగా ఉండటంతో పిల్లలు కావాలనుకుంటున్న వారు చట్టవిరుద్ధ మార్గాలను ఎంచుకుంటున్నారు. విచారణలో ఉన్న ప్రస్తుత రెండు కేసుల్లోనూ తల్లి లేదా తండ్రి ప్రమేయంతోనే శిశు విక్రయాలు జరిగాయి. మానవ అక్రమ రవాణా, శిశు విక్రయాలను అరికట్టేందుకు వివిధ వర్గాల భాగస్వాములతో చర్చించి కోర్టుకు సమర్పించేందుకు మరికొంత సమయం కావాలి’ అని కోరారు. అంగీకరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం.. విచారణను 4వారాలకు వాయిదా వేసింది.
నీటి వనరులపై హైకోర్టుకు ఏజీ నివేదన:రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, నీటి వనరుల స్థలాల్లో ఆక్రమణలను తేల్చేందుకు సర్వే జరుగుతోందని, ఆ వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు తెలిపారు. ఆ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. చెరువులు, సరస్సులు, కుంటలు, నదుల స్థలాల్లో ఆక్రమణల తొలగింపు దిశగా కీలక నిర్ణయం తీసుకున్న హైకోర్టు.. సుమోటోగా పిల్ నమోదు చేసి విచారణ జరుపుతోంది. ఈ వ్యాజ్యంతో పాటు ఆక్రమణలపై దాఖలైన మరికొన్ని ప్రజాహిత వ్యాజ్యాలు మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చాయి. ఏజీ స్పందిస్తూ, ఆక్రమణలు తేల్చేందుకు అధికారులు సర్వే చేస్తున్నారని, ఈ వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని కోరారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కందరాడలోని సీతారామ చెరువు స్థలం పూడ్చివేయడం, నిర్మాణాలు చేపట్టడాన్ని అడ్డుకోవాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది.
ఇవీ చూడండి