High Court Permits Teachers Transfers in Telangana : ఉపాధ్యాయుల బదిలీలకు హైకోర్టు(Telangana High Court) పచ్చజెండా ఊపింది. ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్న భార్యభర్తలు కలిసి ఉండేందుకు వీలుగా అదనపు పాయింట్లు కేటాయించడానికీ అనుమతినిచ్చింది. అయితే టీచర్ల యూనియన్ల నేతలకు బదిలీల్లో ప్రాధాన్యమివ్వడం సమర్థనీయం లేదని పేర్కొంది. ఉపాధ్యాయ సంఘాల నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వకుండా బదిలీలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే బదిలీలన్నీ తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేస్తూ.. బదిలీల జీవోపై గతంలో ఇచ్చిన మధ్యంతర స్టే ఉత్తర్వులను సవరించింది.
ఉపాధ్యాయుల బదిలీలు(Teacher Transfers), పదోన్నతులకు మార్గం సుగమమైంది. బదిలీలకు పచ్చజెండా ఊపిన హైకోర్టు.. జీవోపై గతంలో ఇచ్చిన మధ్యంతర స్టే ఉత్తర్వులను సవరించింది. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న టీచర్ దంపతులకు అదనపు పాయింట్లు ఇవ్వడానికి అనుమతినిచ్చిన హైకోర్టు.. యూనియన్ల ఆఫీస్ బేరర్లకు బదిలీల్లో ప్రాధాన్యమివ్వడాన్ని సమర్థనీయంగా కనిపించడం లేదని అభిప్రాయపడింది. కాబట్టి యూనియన్ల నేతలకు అదనంగా పది పాయింట్లను ఇవ్వకుండా బదిలీలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
Teachers Transfers in Telangana : ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల కోసం జనవరిలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీల్లో యూనియన్ నేతలకు, ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్న టీచర్ దంపతులకు ప్రాధాన్యమిస్తూ వారి సర్వీసులకు అదనంగా పది పాయింట్లను కేటాయించారు. ఫిబ్రవరిలో వెబ్ కౌన్సెలింగ్ లో బదిలీల కోసం 73,803 మంది టీచర్లు దరఖాస్తు చేస్తున్నారు. అయితే భార్యభర్తలు, యూనియన్ల నేతలకు అదనపు పాయింట్లను కేటాయించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపిన హైకోర్టు.. జీవోపై స్టే ఇస్తూ మార్చి 14న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో.. బదిలీలతో పాటు పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది.