smita sabharwal defamation case: ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ భర్తతో హాజరైన ఫ్యాషన్ షో అధికార విధుల్లో భాగం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఫ్యాషన్ షోపై ఔట్‌లుక్ పత్రిక ప్రచురించిన కథనం ఆమె అధికార విధులు, తెలంగాణ ప్రభుత్వానికీ వ్యతిరేకం కాదని పేర్కొంది. ఆ పత్రికపై ఆమె దాఖలు చేసిన పరువు నష్టం దావా ప్రైవేటుదని, ఇందులో ప్రజా ప్రయోజనం లేదని పేర్కొంది. ఈ దావా వేయడానికి ప్రభుత్వం కోర్టు ఖర్చుల కింద చెల్లించిన రూ.15 లక్షలను 90 రోజుల్లో తిరిగి చెల్లించాలని స్మితాసభర్వాల్‌ను ఆదేశించింది. అలా చెల్లించని పక్షంలో తదుపరి 30 రోజుల్లో ఆ మొత్తాన్ని వసూలు చేసి రిజిస్ట్రార్ జనరల్‌కు సమాచారమివ్వాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది.
‘ఫ్యాషన్ షో’ అధికార విధుల్లో భాగం కాదు.. రూ.15 లక్షలు చెల్లించాలని స్మితా సబర్వాల్‌కు ఆదేశం - defamation case
20:46 May 02
smita sabharwal defamation case: రూ.15 లక్షలు తిరిగి చెల్లించాలని స్మితాసబర్వాల్‌కు హైకోర్టు ఆదేశం
అసలేం జరిగిందంటే..
2015లో ఓ హోటల్‌లో నిర్వహించిన ఫ్యాషన్ షోలో ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ భర్తతో హాజరుకాగా.. ఔట్‌లుక్ మ్యాగజైన్‌లో ‘నో బోరింగ్ బాబు’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఆమెతో పాటు సీఎంపైనా ఇందులో వ్యాఖ్యలున్నాయి. దీనిపై స్మితా సభర్వాల్ ఔట్‌లుక్‌కు నోటీసులు జారీ చేయడంతో పాటు రూ.10 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేశారు. కోర్టు ఫీజు రూ.9.75 లక్షలు చెల్లించాల్సి ఉందంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనికి సర్కారు అనుమతిస్తూ కోర్టు ఫీజుతో పాటు ఖర్చులకు కలిపి రూ.15 లక్షలు మంజూరు చేస్తూ జీవో ఇచ్చింది. ఈ జీవోను సవాల్ చేస్తూ వి.విద్యాసాగర్, కె.ఈశ్వర్‌రావులు వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, ఔట్‌లుక్ మరో పిటిషన్ దాఖలు చేసింది. వీటన్నింటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి ఇటీవల తీర్పు వెలువరించింది.
అధికరణ 282 ప్రకారం ప్రజా ప్రయోజనాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు మంజూరు చేసే అధికారం ఉందని, అయితే ఒక ప్రైవేటు వ్యక్తి మరో ప్రైవేట్ సంస్థకు వ్యతిరేకంగా వెళ్లడాన్ని ప్రజాప్రయోజనంగా చెప్పరాదంది. సర్కారు కూడా ఎలాంటి చర్య తీసుకోవడం లేదని పేర్కొంది. ప్రైవేటు వ్యక్తి ప్రయోజనం కోసం ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం వేయడం సరికాదంది. ప్రభుత్వ నిర్ణయం అసమంజసం, ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకమని కోర్టు పేర్కొంది.
ఇవీ చూడండి: