రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ప్రజారోగ్య శాఖ సంచాలకుడు శ్రీనివాసరావు, డీజీపీ మహేందర్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం, జైళ్ల శాఖ డీజీ వేర్వేరుగా నివేదికలు సమర్పించారు. కరోనా పరీక్షలు దేశ సరాసరితో రాష్ట్రం వెనకబడి లేదని శ్రీనివాసరావు నివేదికలో పేర్కొన్నారు. ఈనెల 1 నుంచి 14 వరకు సరాసరి 69 వేల 185 పరీక్షలు చేశామని తెలిపారు. రోజుకు కనీసం లక్ష పరీక్షలు జరపాలని ఆదేశాలు జారీ చేసినా ప్రభుత్వం బేఖతారు చేస్తోందని హైకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. అర్టీ-పీసీఆర్, రాపిడ్ యాంటీ జెన్ పరీక్షల వివరాలు వేర్వేరుగా సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలి
ప్రైవేట్ ఆస్పత్రుల్లో గరిష్ఠ ధరలు గతేడాది ఖరారు చేసి ఉత్తర్వులిచ్చామని డీహెచ్ నివేదించారు. కొత్త చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చాయని.. పీపీఈ కిట్లు వాడటం లేదన్న హైకోర్టు.. తాజాగా జీవో జారీ చేయాలని ఆదేశించింది. ప్రైవేటు ఆస్పత్రులపై ఫిర్యాదులు పరిష్కరించేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి.. వివరాలను విస్తృతంగా ప్రచారం చేయాలని స్పష్టం చేసింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లోని పడకల వివరాలను ప్రతీ 15 నిమిషాలకోసారి వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేస్తున్నామని డీహెచ్ నివేదించగా.. క్షేత్రస్థాయిలో వాస్తవాలకు పొంతన ఉండటం లేదని ఫిర్యాదులను పరిశీలించాలని హైకోర్టు తెలిపింది.
ఉచిత కిట్‌లో స్టెరాయిడ్స్ ఉన్నాయా?
ఔషధ ధరల నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో లేదని ప్రజారోగ్య శాఖ సంచాలకులు నివేదించగా.. వివరాలు సమర్పించాలని జాతీయ ఔషధాల ధరల నియంత్రణ సంస్థకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కొవిడ్ బాధితులకు ఇస్తున్న ఉచిత కిట్‌లో స్టెరాయిడ్స్ ఉంటున్నాయని.. ప్రమాదమనే ఫిర్యాదులు అందుతున్నాయని ధర్మాసనం పేర్కొంది. కిట్‌లో స్టెరాయిడ్స్ లేవని అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ వివరణ ఇవ్వగా.. అతివినియోగం వల్ల బ్లాక్ ఫంగస్‌కు దారి తీస్తోందన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. కొన్ని ఆస్పత్రుల్లో ఒప్పంద, పొరుగు సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదని పత్రికల్లో కథనాలు చూశామని.. నిజమేనా అని హైకోర్టు ఆరా తీసింది.
వారికి వేతనలివ్వాల్సిందే
విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి పని చేస్తున్న సిబ్బందికి వేతనాలు ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించింది. ఒప్పంద, పొరుగు సిబ్బందికి వెంటనే వేతనాలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల విధులకు హాజరైన ఉపాధ్యాయులు కరోనా బారిన మరణిస్తున్నారన్న అంశంపై ఉన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల విధులకు హాజరైన ఉపాధ్యాయలు, ఇతర సిబ్బందిని ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించి.. సదుపాయాలను వర్తింపచేయాలని ధర్మాసనం ఆదేశించింది. మూడో దశ కరోనాను ఎదుర్కొనేందుకు ఎలా సన్నద్ధమవుతుందో పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బ్లాక్ ఫంగస్ చికిత్సల ఏర్పాట్లు, అందుబాటులో ఉన్న ఔషధాల వివరాలు నివేదించాలని పేర్కొంది.