ఆస్తుల పరిరక్షణలో వక్ఫ్ బోర్డు వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆస్తులు కబ్జా అవుతున్నా పట్టించుకోరా అని ప్రశ్నించింది. హైదరాబాద్ పాతబస్తీలోని సుల్తాన్ షాహీలో శ్మశాన వాటిక ఆక్రమణలపై ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. శ్మశానవాటిక ఆక్రమణలపై 2018లో వక్ఫ్ బోర్డు అధికారులతో కలిసి తనిఖీ చేసి నివేదిక సమర్పించామని జిల్లా కలెక్టర్ హైకోర్టుకు నివేదించారు. శ్మశాన వాటికలో 815 చదరపు మీటర్లు కబ్జా అయిందని.. 16 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు తేలిందని వివరించారు.
ఆస్తుల పరిరక్షణలో వక్ఫ్ బోర్డు తీరుపై హైకోర్టు అసంతృప్తి
పాతబస్తీ సుల్తాన్ షాహీ శ్మశానవాటిక ఆక్రమణలపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఆస్తుల పరిరక్షణలో వక్ఫ్ బోర్డు తీరుపై ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. కబ్జాలు జరుగుతున్నా పట్టించుకోరా?.. అని ధర్మాసనం ప్రశ్నించింది.
కబ్జాలు గుర్తించినా పరిరక్షించలేరా అని హైకోర్టు ప్రశ్నించింది. ఆక్రమణలపై 4 వారాల్లో చర్యలు తీసుకొని నివేదిక సమర్పించాలని వక్ఫ్ బోర్డును ఆదేశించింది. బంజారాహిల్స్‌లోని హనుమాన్ దేవాలయం వద్ద అక్రమ నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ, జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది. ఆలయ భూముల్లో నిర్మాణాలు జరుగుతున్నాయన్న పిల్‌పై వివరణ ఇవ్వాలని దేవాదాయశాఖ, జీహెచ్ఎంసీ కమిషనర్లకు నోటీసు జారీ చేస్తూ... విచారణను ఏప్రిల్ 15కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: వీలైనంత త్వరగా సీరం సర్వే చేయించండి : హైకోర్టు