హైదరాబాద్ సుల్తాన్ బజార్ మార్గం వన్ వేగా ఉండగా ఇప్పుడు రెండువైపులా వాహనాలను అనుమతిస్తుండటంతో ట్రాఫిక్ సమస్య జఠిలంగా మారింది. సోమ, శనివారాలు వచ్చాయంటే ఉదయం 9 గంటలు మొదలుకుని రాత్రి 10 వరకు రద్దీ తగ్గడం లేదు. పోలీసులు ఎంతగా ప్రయత్నిస్తున్నా నియంత్రించలేక చేతులెత్తేస్తున్న పరిస్థితి. దీనివల్ల వాహనదారులకు సమయం, ఇంధనం వృథా అవుతున్నాయి. ఈ మార్గంలో గంటకు సుమారు 30 వేల వాహనాలు వెళుతున్నాయని అంచనా. ఇప్పుడా సంఖ్య మరింత పెరిగింది.
ఎందుకీ పరిస్థితి..?
ఎంజే మార్కెట్ నుంచి అఫ్జల్‌గంజ్ మార్గంలో ఉస్మాన్‌గంజ్ (బేగంబజార్) నాలా పనులను జీహెచ్‌ఎంసీ యంత్రాంగం చేపట్టింది. జులైలో పనులు ప్రారంభం కాగా.. 45 రోజుల్లో (ఆగస్టు 17 నాటికి) పూర్తి కావాలి. అప్పటి నుంచి ఈ మార్గాన్ని అధికారులు మూసివేశారు. గుత్తేదారు అలక్ష్యం, జీహెచ్‌ఎంసీ పర్యవేక్షణ లోపంతో మూడున్నర నెలలుగా పూర్తి కాలేదు. ఇవి చేసేందుకు మరో 30-45 రోజులు పట్టే అవకాశముంది. దీంతో ఈ మార్గంలో వెళ్లాల్సిన వాహనాలను జాంబాగ్, సుల్తాన్ బజార్, గౌలిగూడ రూట్లలో అనుమతిస్తున్నారు. అసలే ఈ ప్రాంతాల్లో రహదారులు కుంచించుకు పోయాయి. వన్ వేగా ఉన్నప్పుడే రద్దీ అధికంగా ఉండేది. ఇప్పుడు రెండు వైపులా అనుమతిస్తుండటంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి.