బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా వానలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకూ రాష్ట్రంలోని 646 ప్రాంతాల్లో వాన పడింది. అత్యధికంగా కాటారం (జయశంకర్ భూపాలపల్లి జిల్లా), నల్గొండ పట్టణంలో 11 సెం.మీల చొప్పున, వాజేడు (ములుగు), బంట్వారం (వికారాబాద్)లలో 9 సెం.మీ, ధర్మవరం (ములుగు) 8.3 సెం.మీ, రెబ్బెన (కుమురం భీం)లో 7.4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. అంతకుముందు సోమవారం ఉదయం 8 నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకూ పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరులో 13.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లు జలమయమవ్వడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పంటలు నీట మునిగాయి.
రాజధానిలో..
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జంటనగరాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేని వర్షంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం ఉదయం చిరుజల్లులతో మొదలైన వాన మధ్యాహ్నం కాసేపు విరామం తీసుకుంది. మధ్యాహ్నం తర్వాత తిరిగి మొదలై అన్ని ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, బేగంపేట, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, చిలకలగూడ, అల్వాల్, తిరుమలగిరి, ప్యారడైజ్‌లో వర్షం పడింది. పటాన్‌చెరు, మియాపూర్, చందానగర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గంలో మోస్తరు వర్షం కురిసింది.