తెలంగాణ

telangana

ETV Bharat / state

దంచికొడుతున్న వానలు.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు

heavy rains in telangana: రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ముసురుపట్టినట్లు మరికొన్ని చోట్లు కుంభవృష్టిగా పడుతున్నాయి. పలుజిల్లాల్లో ఏకధాటి వానలతో.. పల్లెలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వరద నీరు భారీగా చేరి.. అనేక చోట్ల వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

వర్షాలు
వర్షాలు

By

Published : Jul 11, 2022, 11:10 AM IST

heavy rains in telangana: రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఏడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు... జనజీవనం స్తంభించింది. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో కురిసిన వర్షాలకు.. పలు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. అత్యవసరమై బయటకి వెళ్లేవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

హైదరాబాద్‌లో నాలుగో రోజు కొనసాగుతున్న ముసురు కొనసాగుతోంది. పలుచోట్ల వరద నీరు రోడ్లపైకి ప్రవహిస్తుండడంతో.. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. నగరంలోని మురికికాలువలు వరదనీటితో పొంగిపోతున్నాయి. రాత్రి అత్యధికంగా మైలార్‌దేవ్‌పల్లిలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు అవకాశమన్న వాతావరణశాఖ సూచనతో.. జీహెచ్​ఎంసీ, జలమండలి అప్రమత్తమైంది.

భారీ వర్షాల కారణంగా భద్రాద్రి జిల్లా కొత్తగూడెం సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అండర్ గ్రౌండ్ మైన్‌లోకి వెళ్లే కార్మికులు వరద నీటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గని నుంచి బయటకి వచ్చే రోడ్లు వరద నీటితో చిత్తడిగా మారాయి. గనిలోకి వెళ్లేమార్గంలోని వరద నీటిని.. అధికారులు మోటార్ల ద్వారా బయటకి తీస్తున్నారు. మూడ్రోజుల్లో సుమారు 36 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు ఇప్పటికే రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన వాతావరణ శాఖ ఇవాళ, రేపు కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అంచనా వేస్తోంది. నిజామాబాద్‌, జగిత్యాల, నిర్మల్‌ జిల్లాలు పరిసర ప్రాంతాల్లో ఏకంగా 61 సెంటీమీటర్ల మేర వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని లెక్కకట్టింది. ఎక్కువ ప్రాంతాల్లో 35 సెం.మీ. దాటి వర్షపాతం నమోదయ్యే పరిస్థితులు ఉన్నాయని తెలిపింది.

ఇవీ చదవండి:రెడ్‌ అలర్ట్‌.. రాష్ట్రంలో నేడు, రేపు అత్యంత భారీ వర్షాలు

పన్నీర్​సెల్వంకు హైకోర్టు షాక్.. పళనిస్వామికే పగ్గాలు!.. చెన్నైలో ఉద్రిక్తత

ABOUT THE AUTHOR

...view details