అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్‌లో కుండపోతగా వానలు పడుతున్నాయి. పాతబస్తీ హుస్సేనీ ఆలంలో భారీ వర్షం ధాటికి రేకుల ఇల్లు కూలి ఇద్దరు మృతిచెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కూకట్‌పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, మూసాపేట్, నిజాంపేట్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ప్రజలు అవస్థలు పడ్డారు. ధరణినగర్‌లో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరి చెరువును తలపిస్తోంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోనూ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా కురుస్తున్న వర్షానికి బల్దియా యంత్రాంగం అప్రమత్తమైంది. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ ఆదేశాలతో మాన్సూన్, డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు.
జిల్లాల్లోనూ వరుణ ప్రతాపం
జిల్లాల్లోనూ అల్పపీడనం వల్ల వరుణ ప్రతాపం కొనసాగుతోంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ఆరుగాలం శ్రమించిన పండించిన పంట నేలపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది ఎకరాల్లో కోత దశలో ఉన్న వరి పైరు నేలకూలిపోయింది. కంకులు తేలిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. తడిచిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయాలని అన్నదాతలు అర్థిస్తున్నారు.