ఆకాశానికి రంధ్రం పడిందా అనేలా కురుస్తున్న వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. హైదరాబాద్ నగరంలో మంగళవారం సాయంత్రం కార్యాలయాల నుంచి ఇళ్లకు చేరుకునేందుకు ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. మహానగర వ్యాప్తంగా చాలాచోట్ల 25 సెంటీమీటర్లకు పైనే భారీ వర్షం కురవడంతో కాలనీల్లో వరద పోటెత్తింది. చెరువులు పోటెత్తాయి. ఉస్మాన్‌గంజ్, చింతలబస్తీ ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోయాయి. టోలీచౌకీ నదీం కాలనీ నీట ముంచింది.
హైవేపై ఇబ్బందులు
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రెండు గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి. ఆటోనగర్, ఎల్బీనగర్, హయత్‌నగర్ ప్రాంతాల్లో వాహనాల నుంచి బయటికి రాలేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా విద్యుత్తు వ్యవస్థ గంటల తరబడి స్తంభించింది. మిర్యాలగూడ-హాలియా మధ్య వంతెన దెబ్బతింది. వలిగొండలో బియ్యం మిల్లు కూలింది. ఈ రెండు జిల్లాల్లో ధాన్యం నిల్వ చేసిన చాలా గోదాముల్లోకి నీరు చేరడంతో నష్టం వాటిళ్లింది. ఖమ్మం జిల్లాలో పలు చోట్ల పైకప్పులు కూలిపోయాయి. మేకలు, జీవాలు మృతిచెందాయి.
ఇవాళ కూడా
వాయుగుండం తెలంగాణలోకి ప్రవేశించిందని, ఆ ప్రభావంతో ఇవాళ కూడా భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వానలతో రాష్ట్రవ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారడంతో ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. ప్రాజెక్టులకు ప్రవాహం భారీగా వస్తోంది. దీంతో నీటి మట్టాలను తగ్గిస్తున్నారు. దిగువ ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని శాఖ అధికారి రాజారావు ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లోనూ భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయంటూ అప్రమత్తం చేశారు.
రాజధానిలో చెరువుల ఉగ్రరూపం..
టోలిచౌకిలోని శాతం చెరువు సమీపంలోని కాలనీలు పూర్తిగా మునిగిపోయాయి. వందమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రామంతాపూర్ పెద్ద చెరువుదీ దాదాపు అదే పరిస్థితి. ఆల్వాల్, మూసాపేట, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, మెహిదీపట్నం, కార్వాన్, ఖైరతాబాద్ సర్కిళ్లలోని చెరువులు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. మల్కాజిగిరి బండ చెరువు పొంగిపొర్లుతుండటంతో దిగువన ఉన్న ఎన్‌ఎండీసీ, షిర్డిసాయి నగర్, చంద్రబాబునగర్, తదితర 20కిపైగా కాలనీల్లోకి వరద చేరింది. అప్పర్ ధూల్‌పేటలో కొండ నుంచి బండరాళ్లు దొర్లిపడి ఒక ఇల్లు కుప్పకూలింది. ఆసిఫ్‌నగర్‌లో అమీన్‌మండి ప్రాంతంలో పురాతన ఇల్లు పైకప్పు కూలి ముగ్గురికి గాయాలయ్యాయి.