కుండపోత వర్షంతో హైదరాబాద్ పాతబస్తీలోని అనేక కాలనీలు జలదిగ్బంధమయ్యాయి. చాంద్రాయణగుట్ట, బండ్లగూడ, మలక్‌పేట్, చాదర్‌ఘాట్, గౌలిగూడ, తదితర ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. వరద ఉద్ధృతికి పలుచోట్ల సహాయక చర్యలకు సైతం ఆటంకం కలుగుతోంది.
వరద వల్ల..
చాంద్రాయణగుట్ట అల్ జుబుల్ కాలనీలోని ఓ ఇంట్లోని వరద నీటిలో చిక్కుకుని మహిళ మృతి చెందింది. అదే కాలనీలో వరదలో చిక్కుకుని మృతిచెందిన మరో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పాతబస్తీ గాజమిల్లత్ కాలనీలో గోడ కూలి ఒకరు మృతి చెందారు. మొఘల్‌పురా పరిధి హరిబౌలిలో పురాతన ఇల్లు కూలిపోగా... ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణనష్టం తప్పింది.
ఓవైసీ పర్యటన..
చాంద్రాయణగుట్ట, హాషమాబాద్ ప్రాంతాల్లో పలు ఇళ్లు, వాహనాలు కొట్టుకుపోగా... ఓ మహిళ మృతదేహం బయటపడింది. ఫలక్‌నుమా రైల్వే వంతెనపై రాకపోకలు మూసివేశారు. ఇళ్లపై నిల్చుని బాధితులు సహాయం కోసం వేచిచూస్తున్నారు. టోలీచౌకిలో నీటమునిగిన ప్రాంతాలలో మజ్లీస్ నేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పర్యటించారు.
భయం గుప్పిట్లో..
మూసీ ఉద్ధృత ప్రవాహంతో.... పరిసర ప్రాంత ప్రజలు భయం గుప్పిట్లో కాలం గడుపుతున్నారు. చాదర్‌ఘాట్‌లోని పలు కాలనీల్లోకి మూసీ నీరు వచ్చిచేరింది. జియగూడా పురాణాపూల్‌లో మూసీ ఉప్పొంగి... బైపాస్‌రోడ్డుపైకి చేరింది. బార్కాస్‌లో వరద ఉద్ధృతికి ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. గల్లంతైన వ్యక్తి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి.
జూపార్కులోకి..
ఎంజీబీఎస్ పరిసర ప్రాంతాలలో రోడ్లపై నీరు భారీగా చేరింది. గౌలిగూడతో పాటు పరిసర కాలనీల్లో పెద్ద ఎత్తున నీరు నిలిచింది. గాంధీభవన్ ముందు బస్టాప్ కుప్పకూలింది. రాజేంద్రనగర్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కులోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. జూపార్కును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
హైవే పైకి..
ఆరాంఘర్ వద్ద హైదరాబాద్- కర్నూల్ హైవేపైకి చేరిన వరదనీరు చేరగా... హైదరాబాద్- కర్నూల్ రహదారిపై రాకపోకలు నిలిపివేశారు. పీవీ ఎక్స్‌ప్రెస్ వే పైకి వాహనాలు రావొద్దని ట్రాఫిక్ పోలీసులు కోరారు. భారీవర్షాల కారణంగా అనేక మార్గాల్లో ట్రాఫిక్‌ను దారి మళ్లించారు.
ఇదీ చూడండి:లైవ్ వీడియో: మహిళపై కుప్పకూలిన పురాతన భవనం