హైదరాబాద్‌లో కుండపోతతో వర్షం బీభత్సం సృష్టించింది. దాదాపు 1, 500 కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో బోట్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారులు కోతకు గురవడం వల్ల రవాణా వ్యవస్థ స్తంభించింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. అపార్ట్‌మెంట్ సెల్లార్లన్నీ నీటితో నిండిపోయాయి. సాహితీ అపార్ట్‌మెంట్ సెల్లార్ నీటిలో మునిగి మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. శివం రోడ్డులో కూలిన భారీ వృక్షంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
పొంగిపొర్లిన సరూర్‌నగర్ చెరువు
రామంతపూర్- ఉప్పల్ రహదారి వైపు రోడ్లకు అడ్డంగా పలు చోట్ల చెట్లు నేలకూలి ట్రాఫిక్ స్తంభించింది. రామంతపూర్ పెద్దచెరువు, చిన్నచెరువు గరిష్ఠ నీటిమట్టానికి చేరుకొని ఓవర్ ఫ్లో అవడం వల్ల రోడ్లపై భారీగా వర్షపు నీరు పొంగి పొర్లటంతో... లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఉప్పల్ నల్లచెరువు కట్టతెగడం వల్ల వరంగల్- హైదరాబాద్ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చైతన్యపురిలో పురాతన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం నీటమునిగింది. భారీ వరదతో సరూర్ నగర్ చెరువు పొంగిపొర్లుతోంది. మీర్పేట్ పరిధిలో వర్షబీభత్సానికి కాలనీల వాసులు అతలాకుతలమయ్యారు. బడంగ్‌పేటలోని ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్... వరదలో చిక్కుకున్న 76 మందిని రక్షించింది. హయత్‌నగర్‌లోని బంజారా, ఆర్టీసీ కాలనీలు జలమయమయ్యాయి. వనస్థలిపురం హరిహరపురం కాలనీలో 300 ఇళ్లు వరదలో చిక్కుకున్నాయి.
నేలకొరిగిన భారీవృక్షాలు..
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతంలో వర్షం దాటికి నేలకొరిగిన భారీ వృక్షాలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించారు. ఎస్బీహెచ్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో గల యోగా ఆస్పత్రిలోకి నీరుచేరటం వల్ల విద్యుదాఘాతంతో వైద్యుడు మృతిచెందాడు. కేబీఆర్ పార్కు రహదారి పూర్తిగా జలమయమైంది. మాదాపూర్ శిల్పారామంలో భారీగా వరద నీరు చేరడం వల్ల తాత్కాలికంగా మూసివేశారు. కృష్ణానగర్ ప్రధాన రహదారిపై నీరు నిలవడం వల్ల పలు ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. మూసాపేట మెట్రోస్టేషన్ కింద ప్రధాన రహదారి కుంగింది. బేగంపేట నాలా పొంగిపొర్లుతుండటం వల్ల పరిసరాలు జలమయమమ్యాయి. మణికొండ, పుప్పాలగూడ ప్రాంతాల్లో నడుం లోతుకు పైగా నీరు ఉండటం వల్ల బయట కాలు పెట్టలేని పరిస్థితి నెలకొంది. యూసుఫ్‌గూడ చౌరస్తా సమీపంలోని ఓ పెట్రోల్ బంకు ట్యాంకులలోకి నీరు చేరింది.