హైదరాబాద్‌లో అర్థరాత్రి వాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లు పూర్తిగా మునిగిపోవటంతో ప్రజలు రోడ్లపై ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. శివారులోని పేట్ బషీరాబాద్ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. చుట్టు పక్కల ప్రాంతాల్లో అపార్టుమెంట్‌లు కడుతుండటంతో వరద నీరు నిలిచిపోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో వస్తువులన్నీ తడిచిపోయాయని...నిలువ నీడలేని పరిస్థతి తలెత్తిందని వాపోతున్నారు.
కొన్ని నెలలుగా వర్షానికి నీటమునిగిపోతున్నప్పటికీ...ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదని స్థానికులు ఆరోపించారు. తమకు సాయం చేయాలని విజ్ఞప్తి చేసినా...మాటలు హామీలకే పరిమితం అవుతున్నాయని పేర్కొన్నారు.