హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులతో కూడిన వాన వల్ల వివిధ పనుల నిమిత్తం బయటికొచ్చిన ప్రజలు, కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని సికింద్రాబాద్, ప్యారడైజ్, ప్యాట్నీ, రైల్వే స్టేషన్, చిలకలగూడ, బోయిన్పల్లి, అల్వాల్, తిరుమలగిరి ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వాన పడుతోంది. కోఠి, హబ్సిగూడ, నాచారం, బీఎన్‌రెడ్డినగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, నాగోల్, కూకట్‌పల్లి, అల్విన్ కాలనీ, హైదర్‌నగర్, వివేకానందనగర్ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. సోమాజీగూడ, హిమాయత్‌నగర్, నారాయణగూడ, నాంపల్లి, బషీర్‌బాగ్, అంబర్‌పేట, గోల్నాక, నల్లకుంట, ఖైరతాబాద్, పంజాగుట్ట, ఎస్.ఆర్.నగర్, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట్ కర్మన్‌ఘాట్, పాతబస్తీ, సైదాబాద్, అబ్దుల్లాపూర్‌మెట్ తదితర ప్రాంతాల్లో జోరు వాన కురుస్తోంది.
భారీ వర్షం కారణంగా రహదారులపైకి నీరు చేరింది. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన వాహనదారులు గమ్యస్థానాలకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.