భాగ్యనగర వాసులపై వరుణుడు మరోసారి తన ప్రతాపం చూపుతున్నాడు. గత మూడు, నాలుగు రోజులుగా తెరిపినిచ్చిన వాన.. నేడు ఉదయం నుంచి మళ్లీ మొదలైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు పడుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
కోఠి, బేగంబజార్, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, లక్డీకపూల్, నారాయణగూడ, హిమాయత్‌నగర్ ప్రాంతాలలో ఉదయం నుంచి ఏకధాటిగా కురుస్తోన్న వర్షానికి వరద నీరు రహదారులపైకి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. కోఠిలో దుకాణాలలోకి నీరు చేరి.. వ్యాపారులకు నష్టాన్ని మిగిల్చింది. ఖైరతాబాద్, అమీర్‌పేట్, నాంపల్లి, అంబర్‌పేట్, ఎస్సార్‌నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సోమాజిగూడ తదితర ప్రాంతాల్లోనూ వర్షం పడింది.
సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, చిలకలగూడ, బొల్లారం, జవహర్‌నగర్, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట్, మారేడుపల్లి, మెట్టుగూడ, రాణిగంజ్, రెజిమెంటల్ బజార్‌లో వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, పాటిగడ్డ, బ్రాహ్మణవాడి బస్తీల్లో కురిసిన భారీ వర్షానికి వరద నీరు ఇళ్లలోకి చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఉదయం నుంచి కురిసిన వర్షానికి రాజ్‌భవన్‌రోడ్‌లో రహదారులు జలమయం అయ్యాయి. ఫలితంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. యూసుఫ్‌గూడ కృష్ణానగర్‌కాలనీలను వరద ముంచెత్తింది. స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రాని పరిస్థితి తలెత్తింది. అమీర్‌పేట్‌లో రహదారిపై భారీగా నీరు నిలిచిపోయింది. నిజాంపేట్‌లోని పలు కాలనీల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు చేరాయి. వరద నీటిలో కార్లు మునిగిపోయాయి. కుత్బుల్లాపూర్ లోనూ వివిధ బస్తీలను సైతం వరద ముంచెత్తింది. కూకట్ పల్లిలోనూ జోరు వర్షంతో కాలనీల్లోని రోడ్లపై వర్షపునీరు పోటెత్తింది.
నీట మునిగిన ఇళ్లు..: అపురూపకాలనీ ఇళ్లు నీటమునిగాయి. ఇళ్లలోకి వరద నీరు భారీగా చేరింది. సామగ్రి పూర్తిగా తడిచిపోయింది. మోకాళ్ల లోతు నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. నీటిని ఎత్తిపోసేందుకు ప్రయత్నిస్తున్నారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌బృందాలు....సహాయక చర్యలు చేపట్టారు.