తెలంగాణ

telangana

ETV Bharat / state

వివేక హత్య కేసులో ఆ మూడు అంశాలు దాగి ఉన్నాయి: సుప్రీం కోర్టు - ఏపీ తాజా వార్తలు

YS Viveka murder case updates: వివేకా హత్యకేసులో సునీతారెడ్డి పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం శుక్రవారం సవివరమైన ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేసింది. కేసు మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని సునీత తరఫు న్యాయవాది కోరారు. హైకోర్టు విశ్రాంత జడ్జి పర్యవేక్షణలో దర్యాప్తు సాగాలన్నారు. కాలపరిమితితో కూడిన విచారణ జరపాని తెలిపారు. కేసులో ప్రధానంగా 3 అంశాలు ఉన్నాయని అన్నారు.

వివేక హత్య కేసు
వివేక హత్య కేసు

By

Published : Oct 19, 2022, 2:40 PM IST

YS Viveka murder case updates: వివేకా హత్యకేసులో సునీతారెడ్డి పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం శుక్రవారం సవివరమైన ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేసింది. సునీతా పిటిషన్‌పై గంటకు పైగా సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. కేసు మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని సునీత తరఫు న్యాయవాది కోరారు. హైకోర్టు విశ్రాంత జడ్జి పర్యవేక్షణలో దర్యాప్తు సాగాలన్నారు. కాలపరిమితితో కూడిన విచారణ జరపాని తెలిపారు. కేసులో ప్రధానంగా 3 అంశాలు ఉన్నాయని అన్నారు. కేసులో రాజకీయ జోక్యం ఎక్కువగా ఉందని చెప్పారు. దర్యాప్తుపై స్థానిక ఎంపీ ప్రభావం చూపిస్తున్నారని.. సాక్షులకు ప్రాణముప్పు ఉందని వాదించారు.

కేసులతో సీబీఐ విచారణాధికారినీ భయపెడుతున్నారని సునీత తరఫు న్యాయవాది.. కోర్టుకు తెలిపారు. ఇద్దరు నిందితులు అనుమానాస్పదంగా మృతిచెందారని అన్నారు. సస్పెండైన సీఐ.. ప్రభుత్వంలో పదోన్నతి పొందాక మాటమార్చారని చెప్పారు. జైలు నుంచి అనారోగ్యం పేరుతో కొంతమంది బయటకొచ్చి దర్బార్‌ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. దర్యాప్తును ప్రభావితం చేసేలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. సీబీఐ విచారణాధికారిపైనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి భయపెడుతున్నారని కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు నిజమేనా అని సునీత న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎఫ్‌ఐఆర్‌ కాపీని పొందుపరిచినట్లు సునీత తరఫు న్యాయవాది తెలిపారు. శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి బెదిరింపులను సీబీఐ సవివరంగా పేర్కొందన్నారు.

విచారణ పూర్తికి ఇంకా ఎంతకాలం కావాలని సీబీఐని ధర్మాసనం ప్రశ్నించింది. ఆరు నెలలు సమయం కావాలని సీబీఐ కోరింది. ఏళ్లతరబడి సమయం ఎందుకు పడుతుందని ధర్మాసనం అడిగింది. స్థానిక పోలీసుల సహకారం లేదని సీబీఐ న్యాయవాది... కోర్టు దృష్టికి తెచ్చారు. ఏళ్లతరబడి సాగితే సాక్షులు మారిపోతారు... సాక్ష్యాలు మారిపోతాయని ధర్మాసనం అభిప్రాయపడింది.

విచారణ సందర్భంలో ఏపీ ప్రభుత్వ న్యాయవాదిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ వచ్చినప్పుడు వివరాలతో అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. అధికారులను ఆన్‌లైన్‌లోకి తీసుకోవాలని తెలిపింది. సాక్షులకు వన్‌ ప్లస్‌ వన్‌ భద్రత ఇచ్చినట్లు ఆధారాలేంటని ప్రశ్నించింది. భద్రత విషయంలో కింది కోర్టు ఉత్తర్వులు అమలు చేస్తున్నారన్న సాక్ష్యాలేవని నిలదీసింది. వెంటనే సాక్ష్యాలు తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసింది.

శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి తరఫున కూడా వాదనలు ధర్మాసనం విన్నది. పిటిషనర్‌ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నిందితుల తరఫు న్యాయవాదులు తెలిపారు. ఇద్దరు మృతిచెందారన్న వాదనలో, నిందితులు బెదిరిస్తున్నారన్న వాదనల్లోనూ వాస్తవం లేదని తెలిపారు. విచారణ త్వరగా జరగాలని తామూ కోరుకుంటున్నామని చెప్పారు.

బెదిరింపు అంశంపై కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయవచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది. సాక్షులను బెదిరిస్తున్నారన్న ఒక్క వాదన... మరో రాష్ట్రానికి బదిలీ చేయడానికి అవకాశం ఇస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బదిలీపై పునరాలోచించాలని ధర్మాసనాన్ని నిందితుల తరఫు న్యాయవాదులు కోరారు. శుక్రవారం సవివరమైన ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం తెలిపింది.

ఇవీ చవదండి:

ABOUT THE AUTHOR

...view details