తెలంగాణ

telangana

ETV Bharat / state

Harish rao in Gandhi hospital : 'గాంధీ ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం'

Harish rao in Gandhi hospital: కరోనా సమయంలో గాంధీ ఆస్పత్రి వైద్యుల సేవలు మరువలేనివని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. గాంధీ ఆస్పత్రి అభివృద్ధికి రూ.175 కోట్లు మంజూరు చేశామన్న మంత్రి... ఇప్పటికే రూ.100 కోట్ల విలువైన పనులు పూర్తి చేశామని చెప్పారు. మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీతో కలిసి గాంధీ ఆస్పత్రిలో సీటీ స్కాన్ కేంద్రాన్ని హరీశ్‌రావు ప్రారంభించారు.

Harish rao in Gandhi hospital, ct scan
గాంధీ ఆస్పత్రిలో సీటీ స్కాన్ ప్రారంభించిన మంత్రులు

By

Published : Dec 11, 2021, 12:29 PM IST

Updated : Dec 11, 2021, 1:27 PM IST

Harish rao in Gandhi hospital : గాంధీ ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆస్పత్రి అభివృద్ధికి రూ.175 కోట్లు మంజూరు చేయగా.... రూ.100 కోట్ల పనులు పూర్తి అయ్యాయని చెప్పారు. మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికను పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసు నమోదు కాలేదన్న హరీశ్‌ రావు... వైరస్‌ ఏదైనా మాస్కు తప్పనిసరని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తీసుకొని కరోనా నుంచి కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో గాంధీలో మరో 200 పడకల ఆస్పత్రి సముదాయం నిర్మాణంలో ఉందని హరీశ్‌రావు తెలిపారు. కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా గాంధీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది సేవలు మరువలేనివని హరీశ్‌ కొనియాడారు. మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీతో కలిసి గాంధీ ఆస్పత్రిలో సిటీ స్కాన్ కేంద్రాన్ని హరీశ్‌రావు ప్రారంభించారు.

గాంధీ ఆస్పత్రిలో సీటీ స్కాన్ ప్రారంభించిన మంత్రులు

రాష్ట్రంలో ఒమిక్రాన్ లేదు..

రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదన్న హరీశ్‌రావు... విదేశాల నుంచి వచ్చిన వారిలో 15 మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు. వారిలో 13 మందికి ఒమిక్రాన్‌ నెగిటివ్ వచ్చిందని చెప్పారు. మరో ఇద్దరి ఒమిక్రాన్ పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రిలోనూ అధునాతన పరికరాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని హరీశ్‌ రావు వెల్లడించారు.

గాంధీ ఆస్పత్రిలో సిటీ స్కాన్ కేంద్రం ప్రారంభించాం. అత్యవసర పరిస్థితుల్లో సిటీ స్కాన్ అవసరం ఉంది. రాష్ట్రంలో మొత్తం 21 సిటీ స్కాన్ కేంద్రాలు మంజూరు చేశాం. తొలి సిటీ స్కాన్‌ కేంద్రాన్ని గాంధీలో ప్రారంభించాం. ఆధునిక పరికరాలను సమకూరుస్తున్నాం. గాంధీలో 45 రోజుల్లో క్యాథ్ ల్యాబ్ అందుబాటులోకి తెస్తాం. రూ.12.5 కోట్లతో ఎంఆర్‌ఐ స్కాన్‌ మంజూరు చేశాం. గాంధీలో మరో 200 పడకల ఆస్పత్రి సముదాయం నిర్మాణంలో ఉంది. 80వేలకు పైగా కరోనా పేషంట్లకు వైద్యం అందింది. ప్రైవేటు ఆస్పత్రులు పట్టించుకోని సమయంలో గాంధీలో మంచి వైద్యం అందించారు. ప్రతిఒక్కరికీ మాస్కే శ్రీరామరక్ష. అర్హులైన వారంతా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకొని కరోనా నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి.

-హరీశ్‌రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి

గాంధీ ఆస్పత్రి దేశంలోనే ల్యాండ్ మార్క్​గా ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కరోనా సమయంలో గాంధీ అస్పత్రి విశేష సేవలు అందించిందని అన్నారు.

ఇదీ చదవండి:చాపకింద నీరులా కరోనా- 'ఒమిక్రాన్​'తో ఆంక్షల్లోకి దేశాలు!

Last Updated : Dec 11, 2021, 1:27 PM IST

ABOUT THE AUTHOR

...view details