Harish Rao on Thalassemia: తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్య శ్రీ కింద ఉచితం వైద్యం అందిస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రాజేంద్రనగర్‌లోని కమల హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన జాతీయ సదస్సుకు ఆయన హాజరయ్యారు. తెలంగాణను తలసేమియా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది దేశంలోనే తొలి రాష్ట్రంగా నిలుపుదామన్నారు. తలసేమియా, సికిల్ సెల్ బాధిత పిల్లలను చూస్తే చాలా బాధ కలుగుతుందని హరీశ్ రావు పేర్కొన్నారు.
జన్యు పరమైన ఇబ్బందులు తలెత్తకుండా హెచ్ బీఎ2 టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. తలసేమియా వ్యాధి గ్రస్తులకు కమలా సోసైటీ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఇప్పటికే ఉస్మానియా, నీలోఫర్, గాంధీ ఆసుపత్రుల్లో తలసేమియా రోగులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల శాతాన్ని పెంచేందుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని వెల్లడించారు.
మాతా, శిశు మరణాల రేటును తగ్గించేందుకు కేసీఆర్ కిట్ ఇస్తున్నామని చెప్పారు. ఆరోగ్య రంగానికి బడ్జెట్‌లో 4.5 శాతం కేటాయించాం. 33 జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మెడికల్ విద్య అందరికీ అందడంతో పాటు, నాణ్యమైన వైద్య సేవలు ప్రజలకు అందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అన్నీ రంగాల్లో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. దేశంలో ఎక్కడ చూసినా విద్యుత్ కోతలే కానీ రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్‌ను ప్రతీ రంగానికి అందిస్తున్నామన్నారు. 30 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ఇది దేశానికే ఆదర్శంగా నిలించిందని హరీశ్ రావు వెల్లడించారు.