విజయ్ హజారే ట్రోఫీకి ఆటగాళ్ల ఎంపిక విషయంలో అవతవకలు జరిగాయంటూ మాజీ హెచ్‌సీఏ అధ్యక్షుడు వినోద్ ఆరోపించారు. టోర్నీకి ఎంపిక కానీ ఆటగాళ్లు వారి తల్లిదండ్రులతో కలిసి ధర్నా చేపట్టారు. సికింద్రాబాద్ జింఖానా మైదానంలోని హెచ్‌సీఏ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ప్రతిభను కాదని డబ్బున్న వారికే ఎంపికలో ప్రాధాన్యం ఇస్తున్నారని హెచ్‌సీఏ సభ్యులతో కలిసి ప్లకార్డులు ప్రదర్శించారు.
హెచ్‌సీఏ తీరు సరికాదు:
విజయ్ హజారే ట్రోఫీలో 26 మంది ఆటగాళ్లను ఎంపిక చేయగా.. 15 మంది విషయంలో అవకతవకలు జరిగాయని అన్నారు. గత కొన్ని రోజులుగా అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్న ఆటగాళ్లను విస్మరించి కేవలం హెచ్‌సీఏకు చెందిన వారి పిల్లలను, డబ్బున్న వారికే పెద్దపీట వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎన్నో సంవత్సరాలుగా అన్ని టోర్నీల్లో ప్రతిభ కనబరుస్తున్న ఆటగాళ్ల విషయంలో హెచ్‌సీఏ తీరు వివాదాస్పదంగా ఉందన్నారు.
పునరాలోచించాలి:
ప్రస్తుత క్రికెట్ పోటీ ప్రపంచంలో ఎంతో మంది ప్రతిభ కలిగిన పేద ఆటగాళ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారవడానికి హెచ్‌సీఏ విధానాలే కారణమని ఆరోపించారు. ఆటగాళ్ల ఎంపిక విషయంలో మరోసారి పునరాలోచించాలని వినోద్ అభిప్రాయపడ్డారు. గతంలో ఇలాంటి సెలక్షన్స్ ఎప్పుడూ జరగలేదని ఆయన తెలిపారు. ఇప్పటికే రంజీ ట్రోఫీలో హైదరాబాదు జట్టు వెనుకబడిందని.. ఇలాగే కొనసాగితే హైదరాబాద్ నుంచి జాతీయ జట్టుకు ఎంపిక కాలేరని ఆయన అన్నారు.