Harish Rao on Medical Services in Telangana : రాష్ట్రంలో వ్యాధులు వచ్చిన తర్వాత మెరుగైన చికిత్స అందించడంతో పాటు.. వ్యాధులు రాకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మారుతున్న సాంకేతికత అందిపుచ్చుకునేలా వస్క్యులర్ సర్జరీ సింపోజియం నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. వైద్యులు నిత్య విద్యార్థులు.. రోజు రోజుకు ఎంతో సాంకేతికత పెరుగుతుందని తెలిపారు. ప్రముఖ కిడ్నీ స్పెషలిస్ట్ దామోదర్ రెడ్డి కుంబాల ఆధ్వర్యంలో నైపుణ్యాలు పెంచుతున్నారని కొనియాడారు. నిమ్స్ ఆసుపత్రిలో దాదాపు రూ.2 కోట్లతో ఏర్పాటు చేసిన ఇంట్రా ఆపరేటివ్ ఆల్ట్రా సౌండ్, ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్, అల్ట్రా సోనిక్ ఆస్పిరేట్ వైద్య పరికరాలను హరీశ్‌రావు ప్రారంభించారు.
తెలంగాణ ఛాంపియన్: డయాలసిస్ సేవలు అందించడంలో తెలంగాణ ఛాంపియన్ అని హరీశ్‌రావు అన్నారు. డయాలసిస్ చికిత్స కోసం ఇప్పటివరకు రూ.700 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఏటా రూ.100 కోట్ల వరకు వ్యయం చేస్తున్నట్లు చెప్పారు. 10,000 మందికి డయాలసిస్ చేస్తున్నామని పేర్కొన్నారు. వారికి బస్ పాస్, పింఛన్లు.. జీవిత కాల మందులు ఉచితంగా అందిస్తున్నట్లు హరీశ్‌రావు వివరించారు.
శుద్ధి చేసిన ఉపరితల తాగునీటిని అందిస్తున్నాం: కిడ్నీ సంబంధిత వ్యాధులు రాకుండా.. శుద్ధి చేసిన ఉపరితల తాగునీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రాథమిక దశలోనే గుర్తించి వ్యాధులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. జీవన్‌దాన్‌లో అవయవ దానం వెయిటింగ్ లిస్ట్ ఎక్కువగా ఉందని.. అందరం కలిసి అవయవదానాన్ని ప్రోత్సహించాలని హరీశ్‌రావు పిలుపు నిచ్చారు.