Harish rao On Dengue: డెంగీ నిర్మూలనలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రతి ఆదివారం తప్పనిసరిగా ఇంటి చుట్టూ ఇంటి లోపల నీటి నిల్వలు.. దోమల లార్వా పెరగకుండా చూసుకోవాలని సూచించారు. ఆదివారం తన నివాసంలో 10 గంటలకు 10 నిమిషాలు డెంగీ వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీ ఎంటమాలజీ అధికారులతో కలసి ఇంటి అవరణలోని నీటి నిల్వలను మంత్రి పరిశీలించారు.
దోమల నివారణకు ప్రజలు భాగస్వామ్యం కావాలని హరీశ్‌రావు పేర్కొన్నారు. దోమ లార్వాను తోక పురుగులు అనుకోని వదిలివేయడం వల్ల దోమలు పెరుగుతున్నాయని తెలిపారు. సెప్టెంబర్, నవంబర్ నెలలో డెంగీ వ్యాధి నివారణ కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి తన నివాసంలో డెంగీ వ్యాధి నివారణలో భాగంగా ఇంటి చుట్టూ ఉన్న నీటి నిల్వలను ఆయన తొలగించారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా డెంగీ బారినపడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు సుమారు 3000 పైగా డెంగీ కేసులు నమోదైనట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. నగరంలో ఇప్పటివరకు దాదాపు 13వేల వరకు డెంగీ నిర్ధారణ పరీక్షలు చేయగా.. అందులో 1500 మంది వరకు పాజిటివ్‌గా తేలటం ఆందోళన కలిగిస్తున్న అంశం.