Harish Rao Reacts on Projects Are Handed Over to KRMB :రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్పై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది తప్ప పరిపాలనపై దృష్టి సారించడం లేదని మాజీమంత్రి హరీశ్‌రావు(Harish rao) ఆరోపించారు. కృష్ణా జలాల విషయంలో ఏమాత్రం అలసత్వం వహించినా భవిష్యత్ తరాలకు గొడ్డలి పెట్టు అవుతుందన్నారు. ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు(KRMB) అప్పజెప్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, రాష్ట్ర హక్కులను కేంద్రం చేతిలో పెడితే అడుక్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి పెట్టి భవిష్యత్ తరాలకు ఇబ్బంది కాకుండా చూడాలని కోరారు.
'ఇంకా వంద రోజులు కాలేదని ఆగుతున్నాం - లేదంటే చీల్చి చెండాడేవాళ్లం'
2021 జులైలో నోటిఫికేషన్ వస్తే అప్పటి నుంచి కేసీఆర్(KCR) ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ ఏకపక్షంగా అప్పగించలేమని బీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టం చేసిందని వివరించారు. ముందు ఆపరేషన్ మ్యానువల్ ఖరారు చేయాలని, కృష్ణా జలాల్లో తెలంగాణకు సగం వాటా ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ఏకపక్షంగా నోటిఫై చేశారని, అపెక్స్ కమిటీకి నివేదించాలని కేసీఆర్ ప్రభుత్వం స్పష్టంగా చెప్పినట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు.
BRS Loksabha Preparatory Meetings : వారం రోజుల్లో ప్రాజెక్టులను అప్పగిస్తామని అంటున్నారని, జాతీయ హోదా తీసుకొస్తామని చెప్పి ఉన్న ప్రాజెక్టులను దిల్లీకి అప్పగిస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. ఏదీ తేలకుండా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగిస్తే తీవ్ర నష్టం జరుగుతుందన్న ఆయన, జలవిద్యుత్ ఉత్పత్తిలో స్వయం ప్రతిపత్తి కోల్పోతామని, సాగర్ ఆయకట్టు దెబ్బ తింటుందని అన్నారు. హైదరాబాద్, ఇతర జిల్లాలకు తాగునీటి సమస్యలు వస్తాయని, పాలమూరు - రంగారెడ్డి సహా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ప్రశ్నార్థకం అవుతాయని హరీశ్‌రావు అన్నారు.