Newly Appointed Assistant Professors at NIMS: హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో నూతనంగా నియామితులైన 26 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు నియామక పత్రాలు అందజేశారు. అనంతరం మాట్లాడిన ఆయన.. నిమ్స్ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే వారిలో ఎక్కువశాతం పేదలు, ఉచితంగా చికిత్స పొందేవారే ఉంటారని గుర్తుచేశారు. వారికి ఓపికతో చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.
తొలిసారి నిమ్స్ ఆసుపత్రిలో అన్ని వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేశామని ఆయన తెలిపారు. బాగా పనిచేసే వైద్యులకు ప్రభుత్వం తరపున ప్రోత్సాహాకాలు పెంచాలని ఆలోచన చేస్తున్నట్లు ప్రకటించారు. వైద్యులు వ్యక్తిగత లాభాలు చూసుకోకుండా ప్రభుత్వం కోసం, పేద ప్రజల కోసం పనిచేయాలని హితావుపలికారు. అందరూ కలిసి పనిచేస్తే అద్బుతమైన ఫలితాలు వస్తాయని ఆయన సూచించారు. నిమ్స్‌లో ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నాయని వాటిని కూడా భర్తీ చేయాలని నిమ్స్ అధికారులకు మంత్రి ఆదేశించారు.
ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు ఎక్కువగా అందించే విధంగా చూడాలని ఆరోగ్య శ్రీ సీఈఓ సూచనలు చేశారు. ప్రభుత్వం ఇచ్చే ఎల్ఓసీలు కూడా ఎక్కువగా నిమ్స్ ఆసుపత్రికే ఇస్తున్నామని తెలిపారు. 3 వేల 630 పడకల ఆసుపత్రిగా నిమ్స్ రూపుదిద్దుకుంటోందని ఆయన తెలిపారు. సంస్థ బలోపేతానికి అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. కొత్తగా నియామితలైన అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మంత్రి శుభకాంక్షలు తెలిపారు.
అంతకు ముందు ఎర్రమంజిల్‌లో నిమ్స్ మాత శిశు నిమ్స్ 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎం.సి.హెచ్ ఆసుపత్రికి మంత్రి భూమి పూజ చేశారు. తెలంగాణ ప్రభుత్వం మాతా శిశు సంరక్షణ కోసం ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు.ఎం.సి.హెచ్.ల మీద రూ.490 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఆయన తెలిపారు. గాంధీలో, అల్వాల్‌లో , నిమ్స్‌లో మొత్తం 600 పడకల ఎం సి హెచ్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.