Harish Rao Latest Comments on Congress Leaders: కాంగ్రెస్ పార్టీ ఇచ్చేవన్నీ ఉత్తుత్తి డిక్లరేషన్లు.. కర్ణాటకలో ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు చేయలేదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆక్షేపించారు. దళితులపై కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తుందని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్లో చేరిన పీసీసీ ప్రధాన కార్యదర్శి రంగినేని అభిలాష్‌రావుకు మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి అభిలాష్‌రావు అనుచరులు, శ్రేణులు భారీగా తరలివచ్చారు. గత రెండు ఎన్నికల్లో కూడా మ్యానిఫెస్టోలో చెప్పినవి, చెప్పనవి అన్నీ ప్రభుత్వం చేసిందని తెలిపారు. కేసీఆర్(KCR) నాయకత్వంలో రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ సహా వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నారని తెలిపారు.
BRS Joinings in Telangana : రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లి అడిగినా బీఆర్ఎస్ సర్కార్.. కేసీఆర్ హాట్రిక్ కొట్టబోతున్నారని జోస్యం చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన అభిలాష్ రావు.. కాంగ్రెస్‌లో పనిచేసినా ఇప్పుడు బీఆర్ఎస్లో చేరుతున్నారని, భవిష్యత్తులో ఆయనకు పార్టీ ఉన్నత స్థానం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ఒక్క పాలమూరు ఉమ్మడి జిల్లాలో ఐదు వైద్య కళాశాలలు వచ్చాయని.. కల్వకుర్తికి వంద పడకల ఆసుపత్రి వచ్చిందంటే సీఎం కేసీఆర్ వల్లేనని స్పష్టం చేశారు. త్వరలో పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభం కాబోతోందని ప్రకటించారు.
Telangana Assembly Elections: ఈసారి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలమూరు జిల్లా అభివృద్ధి చెందిందని అన్నారు. మరోవైపు, తెలంగాణలో ఒక ఎకరా అమ్మితే ఆంధ్రప్రదేశ్‌లో వంద ఎకరాలు వస్తాయన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు(Chandrababu) వ్యాఖ్యలను గుర్తు చేశారు. కేసీఆర్ సర్కారు అన్నదాతకు శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, పర్యాటక సంస్థ ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్‌యాదవ్, క్రీడా సంస్థ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.