రాష్ట్రంలో కరోనా కేసులు వెలుగుచూసిన తొలినాళ్లలో కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ చికిత్స అందించారు. తదనంతర పరిణామాలతో దాన్ని ప్రభుత్వాసుపత్రులకే పరిమితం చేశారు.మరోవైపు సుమారు 50 రోజులుగా ప్రైవేటులో సాధారణ ఓపీ సేవలు, ముందస్తు ప్రణాళికతో నిర్వహించే శస్త్రచికిత్సలు నిలిచిపోయి రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ వైద్యసేవలతో పాటు కరోనా చికిత్స నిర్వహణకూ ప్రైవేటు ఆసుపత్రుల్లో అనుసరించాల్సిన నియమనిబంధనలను ప్రభుత్వం రూపొందించింది. కేంద్ర ప్రభుత్వ విధివిధానాలను అనుసరిస్తూ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది.
కొవిడ్ చికిత్సలో..
- ఆసుపత్రుల్లో కొవిడ్ అనుమానిత రోగులకు ప్రత్యేకంగా ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ఏర్పాటుచేయాలి.
- కరోనా అనుమానిత రోగులకు వేరుగా ఐసోలేటెడ్ వార్డులు, గదులను కేటాయించాలి.
- కొవిడ్ నిర్ధారిత పరీక్ష ఫలితాలు వచ్చే వరకూ అనుమానిత బాధితుడు ఐసోలేషన్ వార్డు/గదిలోనే ఉండాలి.
- పీపీఈ ధరించిన ల్యాబ్ టెక్నీషియన్ ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ నమూనాలు సేకరించాలి.
- లక్షణాలున్న బాధితులకు విడిగా పడకలు, ఐసీయూ పడకలు, వెంటిలేటర్లతో కూడిన ఐసీయూ పడకలు.. ఇలా చికిత్సకు వేర్వేరుగా ఏర్పాట్లుచేయాలి.
- ఈ రోగుల శస్త్రచికిత్సలకు ఆపరేషన్ థియేటర్, శస్త్రచికిత్సానంతర గది, కాన్పు గదులను విడిగా నెలకొల్పాలి.
- ఇక్కడి సిబ్బంది తప్పనిసరిగా వ్యక్తిగత పరిరక్షణ జాగ్రత్తలను అనుసరించాలి.
- కరోనా నిర్ధారిత రోగులను నిత్యం ఫిజీషియన్ పరీక్షించాలి. అవసరమైతే కార్డియాలజిస్ట్, పల్మనాలజిస్ట్, మత్తు వైద్య నిపుణుడు, ఇతర నిపుణుల సేవలను కూడా అందించాలి.
- వీరికి అందించే చికిత్సల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియమ నిబంధనలు పాటించాలి.
- కరోనా బాధితులకు, వారి సహాయకులకు.. రోగుల ఆరోగ్యంపై నిత్యం వీడియో కౌన్సెలింగ్ నిర్వహించాలి.
- ఒకవేళ కరోనా బాధితుడు మరణిస్తే.. మృతదేహం అప్పగింతలో కచ్చితంగా నిబంధనలు అనుసరించాలి.
- అన్ని ఆసుపత్రులూ కొవిడ్ పాజిటివ్ కేసుల సమాచారాన్ని ఎప్పటికప్పుడూ వైద్యశాఖకు అందించాలి.
- కొవిడ్, నాన్ కొవిడ్ మృతుల సమాచారాన్ని, కారణాలను సర్కారుకు చేరవేయాలి.