తెలంగాణ

telangana

ETV Bharat / state

బోగస్ సంస్థల భరతం పడుతున్న జీఎస్టీ

డొల్ల కంపెనీల పేరిట నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించి ప్రభుత్వ ఖజానాకు కన్నం వేస్తున్న అక్రమార్కులకు కళ్లెం వేసేందుకు చర్యలు వేగవంతమయ్యాయి. ఇప్పటికే వందల కోట్లు కొల్లగొట్టిన  డొల్ల కంపెనీల బాగోతాన్ని బయట పెట్టిన అధికారులు... మరింత లోతైన పరిశీలన చేస్తున్నారు.

బోగస్ సంస్థల భరతం పడుతున్న జీఎస్టీ

By

Published : Jul 15, 2019, 2:55 PM IST

వ్యాపార లావాదేవీల్లో పారదర్శకత పెంచడం కోసం తెచ్చిన జీఎస్టీ... అక్రమార్కులకు అక్షయపాత్రలా మారింది. రూపాయి పెట్టుబడి లేకుండా... వ్యాపారం చేయకుండా... ప్రభుత్వ ఖజానాకు కన్నం వేస్తూ జేబులు నింపుకుంటున్నారు. గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న ఈ దందా ఒక్కొక్కటిగా బయటపడుతోంది.

రూ.250కోట్ల ప్రభుత్వ రాయితీ స్వాహా

కేంద్ర మాజీ మంత్రికి చెందిన 8 డొల్ల కంపెనీలు... హైదరాబాద్‌లో 14వందల 45 కోట్ల విలువైన వ్యాపారం చేసినట్లు నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించాయి. 250 కోట్ల మేర ప్రభుత్వం నుంచి రాయితీ కొల్లగొట్టాయి. ఈ వ్యవహారంలో 2 కంపెనీలకు చెందిన ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. మరో ఐదుగురిని అరెస్ట్‌ చేయాల్సి ఉంది. వీరి కోసం లుక్‌అవుట్‌ నోటీసులు ఇచ్చారు. కూకట్‌పల్లిలో నలుగురు కలిసి ఇనుప తుక్కుతో 150కోట్ల విలువైన వ్యాపారం చేసినట్లు చూపించి... దాదాపు 25కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు కన్నం వేశారు. ఈ రెండు కేసులు కేంద్ర జీఎస్టీకి చెందిన ఓ కమిషనరేట్‌ పరిధిలో బయట పడ్డవే. ఇలాంటివి అధిక సంఖ్యలో ఉన్నట్లు అంచనా వేస్తూ... వాటి పని పట్టే దిశలోప్రణాళికలు రూపొందించారు.

అమ్మకాలు అకస్మాత్తుగా పెరిగితే అనుమానమే..

సంస్థలు సమర్పించే పన్ను వివరాల్లో అనూహ్యంగా పెరుగుదల కనిపిస్తే వెంటనే సోదాలు చేస్తున్నారు. అక్కడ లభించే పత్రాల ఆధారంగా వ్యాపారం జరిగిందా? లేదా?..... జరిగి ఉంటే ఎక్కడెక్కడకి సరుకు వెళ్లింది? వెళ్లినట్లు చూపుతున్న వేబిల్లులను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇలా పరిశీలించే సమయంలో ఆ వేబిల్లుల్లో వేసిన వాహనాల నంబర్లు.... కార్లు, ద్విచక్రవాహనాలవిగా తేలుతున్నాయి. ఇవి సరకు రవాణా చేసే వాహనాలు కానందున... నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించారని నిర్ధరణకు వస్తున్నారు.

బోగస్ సంస్థలకు ఒకే నెంబర్​, ఒకే అడ్రస్​

ఒకే చిరునామాతోనే ఒకటి కంటే ఎక్కువ సంస్థలు ఉండడం, ఒకే మొయిల్‌ ఐడీ, ఒకే ఫోన్‌ నంబరు, వే బిల్లుల్లో ఇతరుల నుంచి కొనుగోలు చేసిన పరిమాణం కంటే ఎక్కువ పరిమాణం వేసి ఉండడం లాంటి అంశాల ఆధారంగా బోగస్‌ సంస్థలను గుర్తించే పని వేగవంతం అయ్యింది. దీనికితోడు కేంద్రంలో జీఎస్టీ సాప్ట్‌వేర్‌ అనుమానిత సంస్థలను గుర్తించి రాష్ట్రానికి జాబితా పంపుతోంది. ఆ వివరాల ఆధారంగా అధికారులు రంగంలోకి దిగుతున్నారు. నకిలీ బిల్లులతో ప్రభుత్వం నుంచి తీసుకున్న మొత్తాలను వసూలు చేయడమే కాదు... వడ్డీ, జరిమానా కూడా విధిస్తున్నారు.

ఇదీ చూడండి : పంటపొలాలను కాటేస్తున్న "ఫార్మా" కాలుష్యం

ABOUT THE AUTHOR

...view details