తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యాపారుల దగా.. నెల రోజుల్లో పడిపోయిన వేరుసెనగ ధర - తెలంగాణ వార్తలు

ఏ చిల్లర దుకాణానికైనా వెళ్లి లీటరు వేరుసెనగ (పల్లీ) నూనె ఎంత అని అడగండి.. రూ.160 నుంచి రూ. 175 దాకా చెబుతారు. అదే ఏ వ్యవసాయ మార్కెట్‌కైనా వెళ్లి చూడండి. గత నెలరోజుల్లో క్వింటా పల్లీల ధర రూ. 7,000 నుంచి రూ. 4,000కు పడిపోయింది. వ్యాపారుల దగాతో పల్లి వెలవెలబోతుంటే నూనె ధరలు మాత్రం సలసల కాగుతున్నాయి.

groundnut cost, cooking oil cost
వేరుశనగ ధరలు, వంట నూనెల ధరలు

By

Published : Apr 18, 2021, 7:03 AM IST

పల్లీలు కొని వాటిని శుద్ధి చేసి అమ్ముకుని, లేదా నూనె తయారుచేసి విక్రయించి భారీగా లాభాలు గడిస్తున్న వ్యాపారులు రైతుల నుంచి పంట కొనుగోలు ధర మాత్రం రోజురోజుకు తగ్గించేస్తున్నారు. భారీ మొత్తాలు వెచ్చించి విదేశాల నుంచి నూనెలను దిగుమతి చేసుకుంటున్న పరిస్థితుల్లోనూ మన రైతులకు కనీస మద్దతు ధర దక్కడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మార్క్‌ఫెడ్‌ నూనెగింజల పంటలను మద్దతు ధరకు కొనాలి. మార్కెట్‌లో ధర బాగుందనే సాకుతో ‘రాష్ట్ర సహకార మార్కెటింగ్‌ సమాఖ్య’ (మార్క్‌ఫెడ్‌) వేరుసెనగ కొనుగోళ్లను పూర్తిగా వ్యాపారులకే వదిలేసింది. ప్రభుత్వం తరఫున మద్దతు ధరకు మార్క్‌ఫెడ్‌ కొంటే మార్కెట్‌లో పోటీ ఏర్పడి వ్యాపారులు తప్పనిసరిగా ధరలు పెంచేవారు. దీనివల్ల రైతులకు కాస్తో కూస్తో లాభం చేకూరేది. కానీ మార్క్‌ఫెడ్‌ మౌనంగా ఉండిపోవడం రైతులకు నష్టదాయకంగా మారింది.


ఇలా తగ్గుతోంది..

  • గుజరాత్‌లోని పలు మార్కెట్లలో ప్రస్తుతం క్వింటా వేరుసెనగ ధర రూ.5,000 నుంచి రూ.6,300 దాకా పలుకుతోంది.
  • తెలంగాణలో వేరుసెనగ కొనుగోలుకు అతిపెద్దదైన వనపర్తి మార్కెట్‌లో ఈ నెల 12న క్వింటాకు కనిష్ఠంగా రూ. 2,607, గరిష్ఠంగా రూ. 5,690 చొప్పున వ్యాపారులు చెల్లించారు. ఈ గరిష్ఠ ధర కూడా చాలా కొద్దిపంటకే ఇచ్చి మిగతా రైతులందరికీ రూ. 5,000 లోపే ఇచ్చారు. ఇదే మార్కెట్‌లో గత నెల 15న ఇదే పంటకు కనిష్ఠ ధర రూ. 4,990, గరిష్ఠ ధర రూ. 6,910 చొప్పున చెల్లించారు. ఇప్పుడు ధర తగ్గించేయడంతో రైతులు నష్టపోతున్నారు. ఈ పంటకు క్వింటాకు రూ. 5,275 చొప్పున మద్దతు ధర చెల్లించాలని కేంద్రం సూచించింది. కానీ వ్యాపారులు లెక్కచేయడంలేదు.

స్పందించని మార్కెటింగ్‌ శాఖ


వాస్తవానికి ప్రస్తుత యాసంగిలో రైతులు వేరుసెనగ పంటను సాధారణ విస్తీర్ణం (3.05 లక్షల ఎకరాలు) కన్నా తక్కువగా 2.78 లక్షల ఎకరాల్లో సాగుచేశారు. 2.74 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అర్థ, గణాంకశాఖ అంచనా వేసింది. ఇప్పటికి 33 వేల టన్నులే వ్యాపారులు కొన్నారు. అంటే ఇంకా 80 శాతం పంట మార్కెట్లకు రావాల్సి ఉంది. ఈ దశలో ధర పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట సాగు దిగుబడి పెద్దగా లేకున్నా.. పల్లీ నూనె ధరలు మండుతున్నా నెలక్రితం వరకూ ఎగబడి కొన్న వ్యాపారులు క్రమంగా ధరలు తగ్గిస్తూ వస్తున్నారు. మిగిలిన పంటలను కొనడానికి కేంద్రాన్ని అనుమతి అడిగిన తెలంగాణ మార్కెటింగ్‌ శాఖ వేరుసెనగ విషయంలో మాత్రం స్పందించలేదు. దీనిపై ఉన్నతాధికారులను వివరణ అడిగితే వ్యాపారులు తొలుత మద్దతు ధరకన్నా ఎక్కువే చెల్లించినందున ఈ పంట విషయంలోకేంద్రాన్ని అనుమతి అడగలేదని చెప్పారు.

దిగుబడి అంచనాలు రైతుల్ని దెబ్బతీశాయా?

2020-21లో దేశవ్యాప్తంగా మొత్తం కోటీ లక్ష టన్నుల వేరుసెనగల దిగుబడి రానుందని కేంద్ర వ్యవసాయశాఖ తాజా నివేదికలో వెల్లడించింది. గతేడాది 99 లక్షల టన్నులొచ్చింది. కోటి టన్నులు దాటడం ఇదే తొలిసారి. దిగుబడి ఎక్కువ వస్తుందనే ప్రచారంతో ధర తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. కాని అంతర్జాతీయ మార్కెట్‌లో పల్లీలకు, పల్లినూనెలకు భారీ డిమాండు ఉంది. మనదేశంలో సైతం పల్లీ నూనె ధర గత 6 నెలల్లోనే లీటరుకు రూ. 50 వరకూ పెరిగింది. అయినా పంట కొనుగోలు ధర తగ్గించడంతో రైతులు నిరాశ చెందుతున్నారు.

ఇదీ చదవండి:కరోనా ఎఫెక్ట్​: దుర్భర స్థితిలో విద్యా వాలంటీర్లు, వంట వాళ్లు..

ABOUT THE AUTHOR

...view details