తెలంగాణ

telangana

ETV Bharat / state

రబీలో ధాన్యం కొనుగోళ్లపై నీలినీడలు - రబీలో ధాన్యం కొనుగోళ్లపై నీలినీడలు

రాష్ట్రంలో బియ్యం సేకరణలో భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) మెలిక పెట్టింది. దీంతో యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఎఫ్‌సీఐ మాత్రం ధాన్యం మర ఆడించి 80 శాతం ముడి బియ్యమే అప్పగించాలని.. ఉప్పుడు బియ్యం వద్దని పేర్కొనడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎం చేయాలో అర్థం కావడం లేదు.

grain purchases in Rabi telangana
రబీలో ధాన్యం కొనుగోళ్లపై నీలినీడలు

By

Published : Mar 4, 2021, 6:06 AM IST

బియ్యం సేకరణలో భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) మెలిక పెట్టింది. దీంతో యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ సీజన్‌లో వచ్చేది సింహభాగం ఉప్పుడు బియ్యానికి ఉపయోగపడే ధాన్యమే. ఎఫ్‌సీఐ మాత్రం ధాన్యం మర ఆడించి 80 శాతం ముడి బియ్యమే అప్పగించాలని.. ఉప్పుడు బియ్యం వద్దని పేర్కొనడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటూ పాలుపోవడం లేదు. దొడ్డు రకం ధాన్యాల్లో తేమ శాతాన్ని బట్టి ముడి(సాధారణ) బియ్యంగా వాడాలా లేక ఉప్పుడు బియ్యంగా మార్చాలా అనేది ఆధారపడి ఉంటుంది. తేమ శాతం 25 నుంచి 30 మధ్య ఉంటే ముడి బియ్యంగా వాడుకోడానికి వీలవుతుంది. అంతకంటే ఎక్కువైతే గింజ విరిగిపోతుంది. అప్పుడు వాటిని బాయిల్డ్‌ రైస్‌గా మార్చడం ఒక్కటే మార్గం. యాసంగి సీజన్‌లో ఎండల కారణంగా నీటిని ఎక్కువగా గ్రహించడంతో ధాన్యంలో తేమ శాతం 40కి పైగా ఉంటుంది.

ఎక్కడ నుంచి తెచ్చివ్వాలి?

ప్రస్తుత సీజనులో సుమారు 70 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం కొనుగోలు చేసేందుకు ఎఫ్‌సీఐ సూత్రప్రాయ ఆమోదాన్ని తెలిపింది. ఆ మేరకు అవసరమైన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొంటుంది. రాష్ట్రంలో ఈ సీజన్‌లో 50 లక్షల ఎకరాలకు పైగా వరి వేశారు. సాధారణం కన్నా 132 శాతం అదనంగా నాట్లు వేశారు. వాతావరణం ప్రస్తుతానికి అనుకూలంగా ఉండటంతో 1.10 కోట్ల మెట్రిక్‌ టన్నులకుపైగా దిగుబడి వస్తుందన్నది అంచనా. ఈ సీజనులో 85 నుంచి 90 శాతం ఉప్పుడు (బాయిల్డు)బియ్యానికి అనువైన ధాన్యమే వస్తుంది. ఈ పరిస్థితుల్లో 80 శాతం ముడి బియ్యం ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్రశ్నగా ఉంది.

కొనుగోళ్లపై సంశయాలు

ప్రతి సీజనులో రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం సేకరించి కస్టం మిల్లింగ్‌ కింద మిల్లర్లకు సరఫరా చేస్తుంది. మిల్లర్లు బియ్యంగా మార్చి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి అందజేస్తుంది. ప్రతి సంవత్సరానికి భిన్నంగా ఈ సారి ముడి బియ్యమే కావాలని ఎఫ్‌సీఐ తాజాగా పట్టుపట్టడంతో ధాన్యం కొనుగోళ్లపై సంశయాలు తలెత్తుతున్నాయి. కేంద్రం ఉప్పుడు బియ్యం వద్దు అని పట్టుబడితే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొంటుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఎఫ్‌సీఐ కోరినట్లుగా 80 శాతం వరకు ముడి బియ్యాన్ని ఇవ్వటం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తూ కేంద్రానికి లేఖ రాసినట్లు సమాచారం.

ఇచ్చిన బియ్యం ఎంత

గడిచిన ఆరేడు సంవత్సరాల్లో యాసంగి సీజనులో వచ్చిన దిగుబడి ఎంత? అందులో ఉప్పుడు బియ్యం ఎంత? ముడి బియ్యం ఎంత? ఎఫ్‌సీఐకి ఇచ్చిన బియ్యం ఎంత అన్న గణాంకాలను సైతం ఆ లేఖలో పొందుపరిచినట్లు సమాచారం. కరోనా తీవ్రత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రేషన్‌ కార్డుదారులకు బియ్యం కోటాను పెంచటంతో ముడి బియ్యం నిల్వలు సింహభాగం నిండుకున్నట్లు ఎఫ్‌సీఐ అధికారుల సమాచారంగా ఉంది. మరోపక్క ఉప్పుడు బియ్యం నిల్వలు గోదాముల్లో పుష్కలంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 70 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉప్పుడు బియ్యం తీసుకోవటం ద్వారా ఆ నిల్వలు మరింత పెరుగుతాయన్నది వారి అభిప్రాయంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖతో కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఇదీ చూడండి :ఆస్తి పన్ను వసూలు కోసం ప్రత్యేక అధికారులు

ABOUT THE AUTHOR

...view details