తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో జోరుగా సాగుతున్న ధాన్యం కొనుగోళ్లు.. - grain collection in Telangana

రాష్ట్రంలో ధాన్యం సేకరణ వేగవంతమైంది. గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఈ వానాకాలం సీజన్‌లో 65 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి పంట సాగైంది. దాదాపు కోటి 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి రావొచ్చని అంచనా వేసి.. కోటి మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 6,787 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. రైతుల ఖాతాల్లోకి నేరుగా నిధులు జమ చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ వర్గాలు తెలిపాయి.

రాష్ట్రంలో జోరుగా సాగుతున్న ధాన్యం కొనుగోళ్లు..
రాష్ట్రంలో జోరుగా సాగుతున్న ధాన్యం కొనుగోళ్లు..

By

Published : Dec 1, 2022, 10:09 AM IST

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు చురుగ్గా సాగుతున్నాయి. రైతుల ఇంటి అవసరాలు, విత్తనోత్పత్తి, మార్కెటింగ్ అవసరాలు పోగా.. కోటి మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలుకు సర్కార్‌ ఉపక్రమించింది. మార్కెటింగ్ శాఖ, పౌర సరఫరాల శాఖలు సేకరణను వేగవంతం చేశాయి. 6,787 కొనుగోలు కేంద్రాల ద్వారా రూ.6,892 కోట్ల విలువైన 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూపాయికి కిలో చొప్పున ఒక్కో వ్యక్తికి నెలకు 6 కేజీల రేషన్ బియ్యం పంపిణీ చేస్తుంది. రాష్ట్రంలో మొత్తం 90 లక్షల కార్డులతో 2 కోట్ల 83 లక్షల 42 వేల మందికి రేషన్ అందుతోంది. 54 లక్షల కార్డుల రేషన్ కేంద్రం అందిస్తుండగా.. 36 లక్షల రేషన్ కార్డుల రాయితీ మొత్తాన్ని రాష్ట్రం భరిస్తుంది.

కనీస మద్దతు ధర చెల్లించి ఐకేపీ, సహకార పరపతి సంఘాలు, డీసీఎంఎస్​, జీసీసీ ద్వారా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. గన్నీ బ్యాగులు, ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్ షీట్లు తదితర సౌకర్యాలు పౌర సరఫరాల శాఖ కల్పిస్తుంది. రైతులు, పేదల సంక్షేమం కోసం రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ పేదలకు రేషన్ బియ్యం పంపిణీ చేస్తుంది. రైతుల ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తూ ఇందుకోసం ఆర్థిక భారం ఎంతైనా సరే అని సర్కార్‌ ధాన్యం సేకరిస్తోంది. ఎనిమిదేళ్లలో ప్రభుత్వ చర్యలతో పంటల ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో పాటు రైతుల ఆదాయం పెరిగింది. కరోనా వేళ దాదాపు ఏడాది పాటు వ్యక్తికి 10 కేజీల చొప్పున ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేసింది. అందుకోసం రూ.421 కోట్లు ఖర్చు చేసింది.

ABOUT THE AUTHOR

...view details