Rajiv Swagruha: చాలా కాలంగా నిరుపయోగంగా ఉన్న రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను ఎలాగైనా విక్రయించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. హైదరాబాద్‌లోని బండ్లగూడ, పోచారంతో పాటు జిల్లాల్లోని ఫ్లాట్ల విక్రయానికి ఇటీవలే నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే, ఫ్లాట్ల వారీగా కాకుండా క్లస్టర్ల వారీగా విక్రయించాలని ప్రభుత్వం భావించింది. దీంతో క్లస్టర్ల వారీగా ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఫ్లాట్ల విక్రయంపై సర్కార్ మరో ఆలోచన చేస్తోంది. క్లస్టర్ల వారీగా కాకుండా విడిగా విక్రయించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఇందులో భాగంగా అధికారులతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బండ్లగూడ, పోచారంలోని ఫ్లాట్లు, వాటి స్థితిగతులను పరిశీలించారు. అక్కడున్న వారితో మాట్లాడారు. వాటన్నింటి ఆధారంగా రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను విడిగా విక్రయించేందుకు సర్కార్ సిద్ధమైంది.
యథాతథ స్థితిగానే ఫ్లాట్లను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రక్రియపై సంబంధిత శాఖల అధికారులు, జిల్లాల కలెక్టర్లతో సీఎస్ సోమేశ్ కుమార్ బీఆర్కే భవన్లో సమావేశం నిర్వహించారు. కొందరు ఆర్కిటెక్ట్‌లను కూడా సమావేశానికి ఆహ్వానించారు. ఫ్లాట్లను యథాతథంగా విక్రయించేందుకు తీసుకోవాల్సిన పద్ధతిపై సమావేశంలో చర్చించారు. ఫ్లాట్లకు ఎలాంటి మరమ్మతులు చేయకుండా టవర్‌కు కొన్ని చొప్పున విస్తీర్ణాల వారీగా నమూనా ఫ్లాట్లను తయారు చేయాలని నిర్ణయించారు. వాటిని చూపి కొనుగోలుదారులను ఆకర్షించాలన్నది ఆలోచన. బండ్లగూడలోని 1500 ఫ్లాట్లు, పోచారంలోని 1400 ఫ్లాట్లతో పాటు ఇతర చోట్ల ఉన్న వాటిని విక్రయించనున్నారు.