తెలంగాణ

telangana

ETV Bharat / state

రహదారి భద్రతకు నూతన చట్టం - రహదారి భద్రత చట్టం

రోడ్డు ప్రమాదాల్లో ఏటా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రహదారి భద్రత అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా  వీటిని నివారించలేకపోతున్నారు. దీనికి సంబంధించి నూతన చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర సురక్షిత రహదారి రవాణా చట్టం - 2019 పేరుతో కొత్త చట్టాన్ని తీసుకురానుంది.

రహదారి భద్రత చట్టం

By

Published : May 16, 2019, 5:05 AM IST

Updated : May 16, 2019, 6:55 AM IST

రోడ్డు ప్రమాదాల నివారణకు కొత్త చట్టం

రాష్ట్రంలో రహదారి భద్రతకు సంబంధించి నూతన చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడం సహ భద్రతా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రత్యేక చట్టం అవసరమని భావించింది. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర సురక్షిత రహదారి రవాణా చట్టం - 2019 పేరుతో కొత్త చట్టాన్ని తీసుకురానుంది. రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రత కమిషనరేట్​ ఆయా వ్యవహారాలను పర్యవేక్షించనుంది.

కేంద్ర కమిటీ విధానాల ప్రకారం

రహదారి భద్రతపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కమిటీ నియమించింది. దేశ వ్యాప్తంగా రోడ్డు భద్రతపై అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసిన కేంద్ర కమిటీ ప్రత్యేక చట్టాలు రూపొందించాలని సూచించింది. ఇప్పటి వరకు ఒక్క కేరళలో మాత్రమే ప్రత్యేక చట్టం అమలులో ఉంది. దీనిని అన్ని రాష్ట్రాలు పాటించాలన్న కమిటీ ప్రతిపాదన మేరకు సర్కారు ముసాయిదా ప్రతిని రూపొందించింది. ఎన్నికల నియమావళి ముగిసిన అనంతరం ఈ ముసాయిదాను రాష్ట్ర మంత్రివర్గం ముందు పెట్టేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. అనంతరం ప్రజాభిప్రాయ సేకరణ చేసి వర్షాకాల లేదా శీతాకాల సమావేశాల్లో చట్ట బద్ధత కల్పించేలా యోచిస్తోంది.

తొలి కార్పస్​ నిధి కింద రూ. 100 కోట్లు

నూతన రహదారి భద్రత చట్టానికి తొలి కార్పస్​ నిధి కింద 100 కోట్ల రూపాయలను కేటాయించనుంది. కొత్త చట్టాన్ని అమలు చేసేందుకు రహదారి భద్రత ప్రధాన కమిషనర్​ ఆధ్వర్యంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణకు భద్రతా బృందాలను నియమించనుంది. పోలీసు కంట్రోల్​ రూంల తరహాలోనే రహదారి భద్రత కంట్రోల్​ రూంలను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. దీనికి సంబంధించిన బోర్టును ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. నిబంధనలు ఉల్లంఘించే వారి నుంచి వసూలు చేసే అపరాధ రుసుములో 100 శాతం నిధులు కార్పస్​ నిధిలోనే జమ చేస్తారు. రహదారుల నిర్మాణానికి చేస్తున్న ఖర్చులో 0.5 శాతం మొత్తాన్ని నిధికి జమ చేయాలి. ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేటు సంస్థల నుంచి సామాజిక బాధ్యత కింద విరాళాలు కూడా సేకరించేలా వెసులుబాటు కల్పించాలని ముసాయిదా బిల్లులో ప్రతిపాదించారు.

ఇదీ చూడండి : వలస వచ్చిన వారి పిల్లలకు ఉచిత విద్య

Last Updated : May 16, 2019, 6:55 AM IST

ABOUT THE AUTHOR

...view details