రానున్న రోజుల్లో నీటి సంక్షోభాలను నివారించేందుకు.. వాన నీటి సంరక్షణను ఉద్యమంగా చేపట్టాలని గవర్నర్ తమిళిసై కోరారు. విశ్వవిద్యాలయాలు హరిత క్యాంపస్‌ల్లాగా, వాననీటి సంరక్షణ కేంద్రాలుగా మారాలన్నారు. జాతీయ వాటర్ మిషన్ చేపట్టిన క్యాచ్ ద రెయిన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ, పుదుచ్చేరిలోని విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, రెడ్ క్రాస్ ప్రతినిధులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో గవర్నర్ పాల్గొన్నారు.
భూగర్భ జలాల పెంపు అవశ్యం
వర్షపు నీటిని సంరక్షించుకోవడం వల్ల తాగు, సాగునీటి కొరతను అధిగమించవచ్చునని గవర్నర్ సూచించారు. ప్రపంచ జనాభాలో 18 శాతం.. సంపదలో సుమారు 20 శాతం భారత్‌లోనే ఉన్నప్పటికీ... నీటి వనరులు మాత్రం నాలుగు శాతమే ఉన్నాయన్నారు. భూగర్భ జలాలను విచ్చలవిడిగా వాడుతున్నందున.. 256 జిల్లాల్లో క్లిష్ట దశకు తగ్గిపోతున్నాయన్నారు. వర్షపు నీటి సంరక్షణ ద్వారా భూగర్భ జలాలను పెంపొందించుకోవడం అత్యంత అవశ్యమని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు.