Governor on CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌తో విభేదాలు ఉన్న మాట వాస్తవమే అయినా... ఆ పరిస్థితిని తాను కోరవటంలేదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు... అధికార పార్టీకి విరుద్ధమైన నిర్ణయాలు సైతం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన సమస్యను... వ్యక్తిగతంగా కించపర్చే విధంగా ప్రవర్తించటం సరికాదన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు గానూ అందరం కలిసి సాగాల్సిన అవసరం ఉందని తెలిపారు. సీఎం చేసే అన్ని సిఫార్సులను గవర్నర్ ఆమోదించాలని లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగ పరిధికి లోబడి గవర్నర్ విధులు నిర్వర్తిస్తారని చెప్పారు.
'సీఎం కేసీఆర్‌తో విభేదాలు ఉన్న మాట వాస్తవమే... కానీ' - గవర్నర్ తమిళిసై వార్తలు
16:05 April 19
వ్యక్తిగతంగా అవహేళన చేయటం సరైన పద్ధతి కాదు: గవర్నర్ తమిళిసై
ఏదైనా విభేదించగానే ప్రభుత్వం వివాదం చేయటం సరికాదని... అన్నింటినీ వ్యక్తిగత వ్యవహారాలకు ఆపాదించవద్దని గవర్నర్ చెప్పారు. ప్రోటోకాల్ పాటించకపోవడం సరికాదని పునరుద్ఘాటించారు. పరస్పర చర్చలు, అవగాహనతో సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ విందును బహిష్కరించాయని.. గవర్నర్‌ను ఒక పార్టీకి చెందిన వారిగా చూడటం సరికాదని అన్నారు. ప్రతి ఒక్కరికి భావప్రకటన స్వేచ్ఛ ఉంటుందని... ఒకరు తమ అభిప్రాయం చెప్పగానే విమర్శించడం సరికాదని తమిళిసై తెలిపారు.
'నాకు వ్యక్తిగతంగా గౌరవం ఇవ్వాలని ఆశించటంలేదు. రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది. నేను ఇంతకుముందే చెప్పాను... నేను అహంకారం ఉన్న వ్యక్తిని కాను. శక్తిమంతమైన వ్యక్తినని. అన్ని విభేదాలు మర్చిపోయి ప్రజలకు సేవలందించేందుకు కలిసి పనిచేద్దాం. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు అధికార పార్టీకి విరుద్ధమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. అన్నింటిని ఆమోదించాలని ఎక్కడాలేదు. అలాంటి పరిస్థితుల ప్రభావం మన సంబంధాలపై ఉండొద్దని కోరుతున్నాను. ఎంతో ఆప్యాయతో పంపిన ఆహ్వానాలను గౌరవించాలని అన్ని రాజకీయ పార్టీల నాయకులను నేను విజ్ఞప్తి చేస్తున్నాను. విందులకు పిలిచినప్పుడు ఆహ్వానాలను బహిష్కరించటం అనేది అనవసర రాద్ధాంతం. వ్యక్తిగత ఆహ్వానాలను రాజకీయాలతో ఆపాదించాల్సిన అవసరంలేదు. అన్ని విషయాలపై కూర్చుని చర్చించుకుని.... ప్రజా సంక్షేమం కోసం పాటుపడదామని కోరుతున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి స్నేహపూర్వకమైన వ్యక్తి కాదని నేను చెప్పటంలేదు. కానీ... ఆయనతో విభేదాలు ఉన్న మాట మాత్రం వాస్తవం. నేను ఆ విభేదాలను కోరుకోవటంలేదు. మొదట్లో నేను చంద్రశేఖర్‌రావును కలిసినప్పుడు ప్రతిపాదించిన ఆయుష్మాన్‌భారత్‌ను ఆయన అంగీకరించారు. మా పరస్పర చర్చల ఫలితంగా ప్రజలకు సైతం మేలు జరిగింది. ఇప్పుడు కూడా ఆయనను ఆహ్వానిస్తున్నాను. కూర్చుని చర్చించుకుందాం. ప్రజలకు సేవ చేసేందుకు కలిసి సాగుదాం. ఇలాంటి విభేదాల కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుందనేది నా ఉద్దేశం.' - తమిళిసై సౌందరరాజన్, గవర్నర్
ఇవీ చదవండి :మహిళను ట్రోల్ చేయడం తగునా?