తెలంగాణ

telangana

ETV Bharat / state

Governor Tamilisai Asked Legal Advice on TSRTC Bill : ఆర్టీసీ బిల్లుపై న్యాయ సలహా కోరిన గవర్నర్‌ తమిళిసై

Governor on tsrtc bill
Governor Tamilisai Soundara Rajan on pending bills

By

Published : Aug 17, 2023, 7:46 PM IST

Updated : Aug 17, 2023, 8:40 PM IST

19:39 August 17

ఇతర బిల్లులను కూడా న్యాయశాఖ కార్యదర్శికి పంపిన గవర్నర్‌

Governor Tamilisai Asked Legal Advice on Pending Bills :రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు సహా.. అన్ని బిల్లులపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ న్యాయసలహా కోరారు. ఈ మేరకు బిల్లులను న్యాయశాఖ కార్యదర్శికి పంపినట్లు రాజ్​భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ బిజినెస్ రూల్స్, సచివాలయ నిబంధనలకు లోబడి బిల్లులను న్యాయశాఖ కార్యదర్శికి పంపినట్లు పేర్కొంది. ఉద్యోగుల శ్రేయస్సు, కార్పొరేషన్ బాగు కోరి కొన్ని సిఫార్సులతో ఇటీవల శాసనసభ సమావేశాల్లో ఆర్టీసీ బిల్లును (TSRTC Bill) శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతించినట్లు రాజ్​భవన్​ వెల్లడించింది.

Governor Tamilisai on TSRTC Bill :ఇదే తరహాలో గతంలో వెనక్కి పంపిన నాలుగు బిల్లులకు సంబంధించి.. సిఫార్సులతో కూడిన సందేశాన్ని పంపినట్లు రాజ్​భవన్​ గుర్తుచేసింది. ఆ సిఫార్సులను పరిగణలోకి తీసుకున్నారా లేదా అన్న అంశాన్ని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్​ (Governor Tamilisai Soundara Rajan) నిర్ధారించుకోవాలని అనుకుంటున్నట్లు పేర్కొంది. దీంతో న్యాయశాఖ కార్యదర్శి చేసే సిఫార్సుల ఆధారంగా ఆర్టీసీ బిల్లుపై తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆపినట్లు.. రాష్ట్రపతి ఆమోదానికి పంపాలని నిర్ణయించినట్లు ఇతరత్రా వార్తలు వస్తున్న తరుణంలో మీడియాకు ప్రకటన విడుదల చేస్తున్నట్లు వివరించింది. దురుద్దేశంతో చేస్తున్న అసత్యాలు, నిరాధార ప్రచారంతో ఆందోళనకు గురికావద్దని ప్రజలు, ప్రత్యేకించి ఆర్టీసీ ఉద్యోగులకు రాజ్​భవన్ విజ్ఞప్తి చేసింది.

మరోవైపు ఆర్టీసీ బిల్లును గవర్నర్ తమిళిసై సౌందర రాజన్​కావాలనే ఆపుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. పార్లమెంట్​లో ఆమోదం పొందిన బిల్లులపై రాష్ట్రపతి సంతకం చేశారని.. కానీ శాసనసభ ఆమోదించిన బిల్లులపై మాత్రం గవర్నర్ జాప్యం ఎందుకని ప్రశ్నించారు. బిల్లులు ఆపటానికి రాజకీయ ప్రేరిత అంశాలే కారణమని విమర్శించారు. నామినేటెడ్ ఎమ్మెల్సీల పేర్లను కూడా ఆమె ఆమోదించలేదని అన్నారు. తక్షణమే ఆర్టీసీ బిల్లుపై తమిళిసై సంతకం చేయాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.

గతంలో శాసనసభ, శాసనమండలి ఆమోదించిన పలు బిల్లులకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలపలేదు. ఈ క్రమంలోనే రెండు బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపి.. నాలుగింటిని వెనక్కి పంపారు. దీంతో ఇటీవల జరిగిన శాసనసభ, మండలి సమావేశాల్లో ఆ నాలుగు బిల్లులను పునఃపరిశీలనకు చేపట్టి మళ్లీ యథాతథంగా ఆమోదించారు. ఇందులో పురపాలక నిబంధనలు, పంచాయతీరాజ్, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల, డీఎంఈ వయోపరిమితి పెంపునకు ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లులు ఉన్నాయి.

ఈ క్రమంలోనే మరో ఎనిమిది బిల్లులను కూడా ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించారు. ఇందులో కీలకమైన ఆర్టీసీ ఉద్యోగుల బిల్లుతోపాటు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులు, కర్మాగారాల చట్ట సవరణ బిల్లు, జీఎస్టీ చట్ట సవరణ బిల్లు, మైనార్టీ కమిషన్ చట్ట సవరణ బిల్లు, టిమ్స్ ఆసుపత్రుల బిల్లు, పురపాలక చట్ట సవరణ బిల్లులు ఉభయ సభల ఆమోదం పొందాయి. మొత్తం 12 బిల్లులను అధికారులు నిర్ణీత నమూనాలో రాజ్​భవన్‌కు పంపించారు.

Last Updated : Aug 17, 2023, 8:40 PM IST

ABOUT THE AUTHOR

...view details