Governor Tamilisai Accepts TSPSC Chairman and Members Resignations : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పదవులకు రాజీనామా చేసిన కమిషన్ ఛైర్మన్, ఐదుగురు సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్(Governor Tamilisai) ఆమోదించారు. ప్రభుత్వ లేఖ, న్యాయ నిపుణుల సలహా అనంతరం ఈ మేరకు తమిళిసై నిర్ణయం తీసుకున్నారు. గతంలో జరిగిన పరిణామాలపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వానికి గవర్నర్ సూచించారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి సహా సభ్యులు ఆర్. సత్యనారాయణ, బండి లింగారెడ్డి, కారెం జనార్దన్ రెడ్డి రాజీనామాలను గవర్నర్ తమిళిసై ఆమోదించారు. దీంతో త్వరలో కొత్త కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే పలువురి పేర్లను పరిశీలిస్తోంది. ఇప్పటికే పలు పరీక్షలు పూర్తయినా టీఎస్‌పీఎస్సీ ఫలితాలు మాత్రం ప్రకటించలేదు. కొత్తగా ఛైర్మన్, సభ్యుల నియాకం జరిగితే వాటిని వెల్లడించే అవకాశం ఉందని సమాచారం.
టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనకు సీఎం ఆదేశం - యూపీఎస్సీ, ఇతర రాష్ట్రాల కమిషన్ల అధ్యయనానికి ఆదేశం
Telangana Public Service Commission : ఇప్పుడు రాజీనామా చేసిన ఛైర్మన్, సభ్యుల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నియామకం కాగా, అప్పట్లో ప్రశ్నాపత్రాల లీకేజీ, పరీక్షల రద్దు, నిరుద్యోగుల ఆందోళనలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. శాసనసభ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి సమీక్షను నిర్వహించారు. ఆ వెంటనే ఛైర్మన్, సభ్యులు రాజీనామాలు చేశారు. వీరి రాజీనామాలు గత 15 రోజులుగా గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నాయి. అయితే సిట్ దర్యాప్తు కొనసాగుతున్నందున రాజీనామాలపై అభిప్రాయం తెలపాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు న్యాయ నిపుణుల అభిప్రాయాలను కూడా గవర్నర్ కోరారు. సిట్ దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ ఛైర్మన్, సభ్యుల రాజీనామాలను ఆమోదించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.