చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అఖిలపక్ష నేతలు ఆరోపించారు. నారాయణగూడలోని పద్మశాలి భవన్లో తెలంగాణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో చేనేత కార్మికులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో తెతెదేపా రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ, తెజస అధ్యక్షులు కోదండరామ్, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకట్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం, భాజపా ఎమ్మెల్సీ రాంచందర్రావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందని నాయకులు ఆరోపించారు. కరోనా నేపథ్యంలో వారిని ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నా.. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ శాఖ మంత్రి కేటీఆర్ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.