రాష్ట్ర ప్రభుత్వం ధరణి సమస్యలపై ఇటీవల ఆర్థిక శాఖా మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కమిటీకి సమాచారం అందించేందుకు జిల్లాల్లో యంత్రాంగం సమస్యలను గుర్తించే ప్రక్రియను చేపడుతోంది.
జిల్లాల్లో గుర్తించిన భూ సమస్యలు, ఐచ్ఛికాలు లేని కీలక సమస్యల్లో కొన్ని...
* సేత్వార్, ఖాస్రా పహాణీలోని మూల సర్వే నంబర్లలో వాస్తవ విస్తీర్ణం కన్నా కొత్త పాసుపుస్తకాల్లో విస్తీర్ణం పెరగడం లేదా తగ్గిపోవడం.
* అసైన్డ్ భూములకు చెందిన కొన్ని సర్వే నంబర్లు పట్టా భూములుగా నమోదవడం.
* పట్టా లేదా ప్రభుత్వ భూమి అని భూ స్వభావాన్ని తెలిపే వివరాలు లేవు.
* ఏ ప్రయోజనాలకు భూ సేకరణ చేపట్టారో గుర్తించే వీలు లేదు. దీని వల్ల భూమి వారసత్వ బదిలీ సమయంలో ఇబ్బందులు ఉన్నాయి.
* భూమికి సంబంధం లేని వారి పేర్లు కూడా పాసుపుస్తకాల్లో పట్టాదారుల కింద నమోదయి ఉన్నాయి.
* విస్తీర్ణం ఎక్కువ లేదా తక్కువగా నమోదైన సంఘటనల్లో పలు సర్వే నంబర్లు కనిపించడం లేదు.
* సాగులో లేని భూములను 99999 నంబరుతో నోషనల్ ఖాతా కింద చేర్చారు. వాటిని పట్టాదారులకు బదిలీ చేయాల్సి ఉంది.