TS Govt Officers to contest in elections : వారు వివిధ శాఖల్లో పనిచేస్తున్న సీనియర్ అధికారులు.. ఇప్పుడు వారి దృష్టి రాజకీయాలపై పడింది. రాష్ట్రంలోని పలువురు సీనియర్ అధికారులు వచ్చే ఎన్నికల్లో బరిలో దిగడానికి ఉవ్విళ్లూరుతున్నారు. అధికార పార్టీ బీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగేందుకు కొందరు ప్రయత్నాలు ముమ్మరం చేయగా.. మరికొందరు బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఇతర పార్టీల తరపున పోటీకి సిద్ధమవుతున్నారు.
ఐఏఎస్, ఆదాయపన్ను, బ్యాంకింగ్‌తో పాటు పోలీసు, నీటిపారుదల, రవాణా, వాణిజ్యపన్నులు తదితర ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ఇందులో ఉన్నారు. కొందరు ఇప్పటికే నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారు. టికెట్ వస్తుందో రాదో అన్న అనుమానాలను పక్కనపెట్టి.. తొలుత ప్రజల్లో గుర్తింపు పొందేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అక్కడ జరిగే వివిధ కార్యక్రమాలకు హాజరు కావడం, భారీ హోర్డింగులు ఏర్పాటు చేసుకోవడం ద్వారా రకరకాల ప్రయత్నాలు సాగిస్తున్నారు.
కొందరు మాత్రం అంతర్గతంగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల్లో రూ.కోట్లు ఖర్చు చేయడానికీ వెనకాడని పరిస్థితుల్లో పలువురు అధికారులు పోటీకి సిద్ధమవుతుండటం చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఎన్నికల్లోనూ కొందరు అధికారులు వివిధ పార్టీల తరఫున పోటీకి ప్రయత్నించడం, పార్టీల టిక్కెట్లు దక్కించుకోవడం జరుగుతోన్నా.. వచ్చే ఎన్నికల్లో పోటీకి ప్రయత్నిస్తున్నవారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంది.
* రాష్ట్రంలోని ప్రధాన ఉద్యోగ సంఘం నాయకుడొకరు సంగారెడ్డి నుంచి పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. అధికార పార్టీ తరపున పోటీకి గట్టి ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఆయన ఎక్కువ సమయం అక్కడే గడుపుతున్నారు.
* వైద్యారోగ్య శాఖలో సీనియర్ అధికారి ఒకరు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఓ శాసనసభ స్థానం నుంచి పోటీ చేసేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. ఆ నియోజకవర్గంపై దృష్టి కేంద్రీకరించి తరచూ అక్కడ పర్యటించడం, పలు కార్యక్రమాలు చేపట్టడం, పండగలు, ప్రత్యేక సందర్భాల్లో భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తూనే ప్రభుత్వంలోని పెద్దల మన్ననలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈయన ప్రయత్నాలు ఆరోగ్యశాఖలో చర్చనీయాంశంగా మారాయి.
* జిల్లాస్థాయి అధికారిగా ఉన్న ఓ ఐఏఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓ సీటు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిసింది. ఈయన స్వస్థలం ఆ జిల్లానే కావడంతో ఇటీవల తరచూ వెళ్లిరావడంతోపాటు పోటీ చేయాలనుకొంటున్న నియోజకవర్గంలోనూ పర్యటిస్తున్నారు.
* ఆదాయపన్ను శాఖలో పనిచేస్తున్న ఓ అధికారి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనతో ఉన్నట్లు చెబుతున్నారు.